మహిళ స్నానం చేస్తుండగా బాత్రూం కిటికీలోంచి వీడియో తీస్తున్న ఓ ఆకతాయిని పట్టుకుని దేహశుద్ది చేసారు ఎస్సార్ నగర్ వాసులు.
హైదరాబాద్ : మహిళలు బయటకు వెళ్లినపుడే కాదు ఇంట్లోనే వున్నా లైంగిక వేధింపులు తప్పడం లేదు. చివరకు సొంతింట్లో స్నానం చేయడానికి కూడా మహిళలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎవడు ఎక్కడినుండో చూస్తాడో... ఎవడెక్కడ కెమెరా పెట్టి రికార్డ్ చేస్తున్నాడోనని మహిళలు భయపడిపోతున్నారు. వారి భయాలను నిజం చేసేలా కొందరు ఆకతాయిలు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఓ మహిళ స్నానం చేస్తుండగా ఓ యువకుడు వీడియో తీసిన ఘటన ఎస్సార్ నగర్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ ఎస్సార్ నగర్ లోని ఓ ఇంట్లో కుటుంబంతో కలిసి మహిళ నివాసముంటోంది. అయితే ఆ ఇంటిపక్కనే ఓ బాయ్స్ హాస్టల్ వుంది. ఈ హాస్టల్లో వున్న ఓ యువకుడి కన్ను ఆ ఇంట్లోని మహిళపై పడింది. ఈ క్రమంలోనే దొంగచాటుగా ఆ ఇంటి బాత్రూం వద్దకు చేరుకున్న యువకుడు మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీయసాగాడు. ఇలా ఎన్నాళ్ళుగా ఈ నీచానికి పాల్పడుతున్నాడో కానీ తాజాగా అతడి బండారం బయటపడింది.
Read More 11 ఏళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్ కజిన్స్ గ్యాంగ్ రేప్.. అత్తింట్లో అత్యాచారం...
బాత్రూంలో స్నానం చేస్తుండగా కిటికీ వద్ద ఎవరో తచ్చాడుతున్నట్లు మహిళ గమనించింది. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో కుటుంబసభ్యులు, చుట్టుపక్కల ఇళ్లవారు గుమిగూడారు. ఇదే సమయంలో ఆ ఇంటివద్దనుండి పరారవుతున్న యువకుడిపై అనుమానంతో స్థానికులు పట్టుకున్నారు. మహిళ తాను స్నానం చేస్తుండగా ఎవరో వీడియో తీసారని తెలపడంతో సదరు యువకుడు మొబైల్ చెక్ చేసారు. అందులో మహిళకు సంబంధించిన వీడియో వుండటంతో యువకుడికి దేహశుద్ది చేసారు.
మహిళ కుటుంబసభ్యులకు ఫిర్యాదు మేరకు యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. యువకుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఎస్సార్ నగర్ పోలీసులు.