అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ కే అధిక ఓట్లు... ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే...: రేవంత్ రెడ్డి సంచలనం

Published : Jun 18, 2023, 07:58 AM ISTUpdated : Jun 18, 2023, 08:02 AM IST
అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ కే అధిక ఓట్లు... ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే...: రేవంత్ రెడ్డి సంచలనం

సారాంశం

తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో జోస్యం చెప్పారు. 

హైదరాబాద్ : రాజకీయాలు మరింత వేడెక్కడంతో తెలంగాణలో ఎన్నికల వాతావరణం నెలకొంది. కర్ణాటక ఎన్నికల్లో విజయం తెలంగాణ కాంగ్రెస్ లోనూ కొత్త జోష్ నింపితే బిజెపికి డీలా పడింది. కానీ బిజెపి నాయకులు మాత్రం వెనకడుగు వేయకుండా అధికార బిఆర్ఎస్ పార్టీకి తామే పోటీ అంటున్నారు. బిఆర్ఎస్ కూడా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటూ ధీమాతో వుంది. ఇలా మూడు పార్టీలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహప్రతివ్యూహాలతో ముందుకు వెళుతుండటంతో ఈసారి త్రిముఖ పోరు వుండేలా కనిపిస్తోంది. ఈ మూడు పార్టీల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి... ఎవరు అధికారంలోకి వస్తారు..? అనే ప్రశ్నలు ప్రజల్లో మెదులుతున్నాయి. ఈ క్రమంలో టిపిసిపి చీఫ్ రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు వస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకుని లీడర్లు, క్యాడర్ మంచి ఊపుమీదున్న సమయంలో ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇటీవల పార్టీలవారిగా నిర్వహించిన సర్వేలు ఎలా వున్నాయో వివరించారు రేవంత్. వివిధ సర్వేల్లో బిఆర్ఎస్ కు అత్యధిక ఓటింగ్ శాతం, అధిక సీట్ల వస్తాయని తేలిందన్నారు రేవంత్.ఇప్పటికయితే బిఆర్ఎస్ తర్వాతి స్థానంలోనే కాంగ్రెస్ వుందని రేవంత్ వెల్లడించారు. 

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు అత్యధికంగా 37శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 34 శాతం ఓట్లు వస్తాయని రేవంత్ తెలిపారు. ఇక బిజెపికి 14శాతం ఓట్లకే పరిమితం కానుందని అన్నారు. ఓట్ల శాతం బిఆర్ఎస్ కు కాస్త ఎక్కువగా వున్నా సీట్ల విషయంలో కాంగ్రెస్ సమంగా వుండనుందని అన్నారు. కొన్నిస్థానాల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టిపోటీ వుండనుందని... ఆ స్థానాలే గెలుపును నిర్ణయించనున్నాయని  రేవంత్ తెలిపారు. 

Read More   ఆయనో జులాయి .. కేటీఆర్‌కు ఫిలిం ఇండస్ట్రీలో కావాల్సింది వాళ్లే : రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో ప్రస్తుతం పార్టీల బలాబలాలు చూసుకుంటే బిఆర్ఎస్, కాంగ్రెస్ సమానంగా వున్నాయన్నారు రేవంత్ రెడ్డి. బిఆర్ఎస్ కు 45, కాంగ్రెస్ కు 45 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేసారు. మరో 15 స్థానాల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ వుండనుందని... ఈ స్థానాలే తెలంగాణలో అధికారం చేపట్టేది ఎవరో నిర్ణయించనున్నాయని రేవంత్ పేర్కొన్నారు. 

ఇక బిజెపి గ్రాఫ్ మరింత పడిపోయిందని... గతంలో 24 శాతం వున్న బిజెపి ఓటుబ్యాంక్ ఈసారి 14 శాతానికి పడిపోనుందని రేవంత్ తెలిపారు. బిజెపి, మజ్లిస్ పార్టీలు చెరో 7 సీట్లు సాధించవచ్చని... అంతకంటే బిజెపి ఎక్కువగా ఊహించుకోవద్దని అన్నారు. 

ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి ఈ ఫలితాలు అంచనా వేసినట్లు... రానున్న రోజుల్లో పరిస్థితులు మారిపోయి అంచనాలు కూడా మారవచ్చని రేవంత్ అన్నారు. ఎన్నికల నాటికి పరిస్థితిలో మార్పు వచ్చి కాంగ్రెస్ మరింత బలపడుతుందని అన్నారు. ఇప్పటికి కీలక నాయకులు చాలామంది కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారని... వారి రాకతో పార్టీ మరింత  బలపడనుందని టిపిసిసి చీఫ్ రేవంత్ ధీమా వ్యక్తం చేసారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?