
బెల్లంపల్లి : అమ్మాయిలా చాటింగ్ చేసి ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే మోసగించేందుకు ప్రయత్నించాడో యువకుడు. మీ ఫోటోలు, వీడియోలో తనవద్ద వున్నాయి... అవి బయటపెట్టకుండా వుండాలంటే డబ్బులివ్వాలంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేను అమ్మాయి పేరుతో చాట్ చేసిన యువకుడు బ్లాక్ మెయిల్ చేసాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేసిన నిందితున్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఇటీవల లైంగిక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వ్యాపార పనులపై ఎమ్మెల్యేను కలిసేందుకు వెళితే తన వెంట వచ్చిన అమ్మాయిని పంపాలని ఎమ్మెల్యే చిన్నయ్య కోరినట్లు ఓ మహిళ ఆరోపించింది. ఈ వివాదాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే చిన్నయ్యను బ్లాక్ మెయిల్ చేయాలని కామారెడ్డి యువకుడు భావించాడు. ఇందుకోసం ఓ ప్లాన్ రెడీ చేసుకున్నాడు.
ఎల్లారెడ్డి మండలం అజమాబాద్ కు చెందిన ఎండీ ఇషాక్ ఎలాగో ఎమ్మెల్యే చిన్నయ్య ఫోన్ నెంబర్ సంపాందించాడు. అమ్మాయి పేరుతో ఎమ్మెల్యే ఫోన్ కు వాట్సాప్ తో పాటు సాధారణ మెసేజ్ లు చేసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. మీ వ్యక్తిగత ఫోటోలో, వీడియోలు తనవద్ద వున్నాయంటూ డబ్బులు డిమాండ్ చేసాడు. తనకు రూ.90 వేలు ఇవ్వాలని అమ్మాయి పేరుతో చాట్ చేస్తున్న ఇషాక్ ఎమ్మెల్యే చిన్నయ్యకు మెసేజ్ చేసాడు.
Read More సైబర్ మోసంతో రూ.12 లక్షలు పోగొట్టుకుని ప్రాణాలు తీసుకున్న టెక్కీ..
ఈ బ్లాక్ మెయిల్ వ్యవహారంపై ఎమ్మెల్యే చిన్నయ్య బెల్లంపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాంకేతికత సాయంతో ఎమ్మెల్యేతో అమ్మాయిలా చాటింగ్ చేస్తున్నది ఇషాక్ గా గుర్తించారు. ఎల్లారెడ్డి పోలీసుల సాయంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు బెల్లంపల్లి పోలీసులు. న్యాయంస్థానంలో హాజరుపర్చి రిమాండ్ కు తరలించినట్లు బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులు వెల్లడించారు.
ఎమ్మెల్యే చిన్నయ్యపై లైంగిక ఆరోపణల వివాదం:
అధికార పార్టీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఓ డెయిరీ సంస్థలో భాగస్వామిగా ఉన్న మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. చిన్నయ్య తమను మోసం చేశాడని... ఆయన వద్దకు అమ్మాయిలను పంపించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. బెల్లంపల్లిలో డెయిరీ ఏర్పాటుకు సాయం చేస్తానని చెప్పి ఎమ్మెల్యే చిన్నయ్య డబ్బులు తీసుకున్నారని.. ఇందుకోసం ఆయన చెప్పినట్టుగా విన్నామని తెలిపారు. చిన్నయ్య తమను నమ్మించి మోసం చేశాడని.. తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
ఈ మేరకు ఆ మహిళ ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ‘‘బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మమ్మల్ని నమ్మించి, మా నుంచి డబ్బులు తీసుకొని మాపైనే తప్పుడు కేసులు పెట్టించి రిమాండ్‌కు పంపించారు. దుర్గం చిన్నయ్యను మా బ్రాంచి ఓపెనింగ్ కోసం ఫస్ట్ టైమ్ కలిశాం. అప్పుడు మీ కంపెనీలో మాకు తెలిసిన వాళ్లకు షేర్ ఇవ్వండి.. మీకు ఫుల్ సపోర్టు చేస్తాను, ఏం కావాలన్న చేసినపెడతానని చెప్పారు. మేం దానికి ఒకే చెప్పి.. ఆయన చెప్పిన పర్సన్‌కు షేర్ ఇచ్చాం. ఆ తర్వాత మాకు రెండెకరాల స్థలాన్ని ఇచ్చారు. ఆ స్థలం ఆయనదేనని చెప్పారు. ప్లాంటు కన్‌స్ట్రక్షన్ పనులను సాన శ్రావణ్, థామస్ అనే ఇద్దరు వ్యక్తులకు అప్పగించమని చెబితే.. మేము దానికి కూడా అంగీకరించాం.బిజినెస్ మీటింగ్ కోసం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రెగ్యులర్‌గా చిన్నయ్యను కలిసేవాళ్లం. మేము ఒకరోజు బిజినెస్ పని మీద మాట్లాడేందుకు ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లాం. అప్పుడు మాతో పాటు ఒక అమ్మాయి కూడా వచ్చింది.అయితే ఒక రోజు ఎమ్మెల్యే చిన్నయ్య కాల్ చేసి మీతోపాటు వచ్చిన అమ్మాయిని నైట్‌కు పంపిస్తారా? అని అడిగాడు. ఆ అమ్మాయి అలాంటిది కాదు... కుదరదని చెప్పాను. అయితే ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయిని పంపించాలని ఎమ్మెల్యే బెదిరించారు. ఓసారి దళితబంధు గురించి మాట్లాడాలని పిలిచి తనతోనూ ఎమ్మెల్యే అభ్యంతకరంగా ప్రవర్తించాడు. ఆయన బెదిరింపులకు లొంగకపోవడంతో పోలీసులతో కేసులు పెట్టించి అరెస్టు చేసి వేధిస్తున్నారు'' అని మహిళ తెలిపింది.