
నిజామాబాద్ నగర శివారులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణ కార్మికులతో వెళుతున్న ఆటోను ఎదురుగా వచ్చిన డిసిఎం ఢీకొట్టింది. దీంతో ఆటోలోని ముగ్గురు కార్మికులు మృతిచెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
రెంజల్ మండలం దూపల్లికి చెందిన కొందరు భవననిర్మాణ కార్మికులు నిజామాబాద్ లో పనిచేస్తున్నారు.రోజూ మాదిరిగానే కార్మికులంతా నిన్న(గురువారం) గ్రామం నుండి ఆటోలో నిజామాబాద్ కు చేరుకుని భవననిర్మాణ పనులు చేపట్టారు. సాయంత్రం పని ముగిసాక వచ్చిన ఆటోలో ఇంటికి తిరుగు పయనం అయ్యారు. అయితే నగర శివారులోని అర్సపల్లి బైపాస్ రోడ్డులో ఆటో ప్రమాదానికి గురయ్యింది.
వేగంగా వెళుతున్న కార్మికుల ఆటోను ఎదురుగా అంతేవేగంతో వచ్చిన డిసిఎం ఢీ కొట్టింది. దీంతో ఆటోలోని ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు ఈ ప్రమాదంపై పోలీసులు, అంబులెన్స్ కు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న వారు ముందుగా గాయపడిన వారిని జిల్లా హాస్పిటల్ కు తరలించారు.చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది.
Read More కరీంనగర్ జిల్లాలో బాలుడి కిడ్నాప్ కలకలం .. రెండేళ్ల చిన్నారిని బ్యాగ్‌లో కుక్కి, ఆటోలో వెళ్తుండగా
ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘోర ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
ఈ రోడ్డు ప్రమాదం దూపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతిచెందిన కార్మికుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతిచెందిన పేద కార్మికుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.