కారులో గంజాయిని తన మాజీ ప్రియుడిని తప్పుడు కేసులో ఇరికించడానికి ప్రయత్నించిన లా స్టూడెంట్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన మరో నలుగురు స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
మాజీ ప్రియుడిపై పగ తీర్చుకునేందుకు ఓ ప్రియురాలు చేసిన పని తిరిగి ఆమె మెడకే చుట్టుకుంది. లా చదువుతున్న యువతి తన
మాజీ ప్రియుడిని ఇరికించాలని ఉద్దేశంతో అతడి కారులో గంజాయి పెట్టి పోలీసులకు పట్టించాలని చూసింది. కానీ ఆ యువకుడికి అనుమానం వచ్చి, తనిఖీ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది. చివరికి ఆమె అరెస్టు అయ్యింది.
జూబ్లీహిల్స్ ఇన్ స్పెక్టర్ పి.రవీంద్రప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ బ్యాంకులో కె.శ్రావణ్ కుమార్ అనే యువకుడు పని చేస్తున్నాడు. అతడికి కొంత కాలం కిందట అధోక్షజ అలియాస్ రింకీ అనే లా స్టూడెంట్ తో పరిచయం ఏర్పడింది. తరువాత అది వారి మధ్య ప్రేమకు దారి తీసింది. అయితే కొంత కాలం గడిచిన తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో వీరి ప్రేమ నాలుగు నెలల్లోనే ముగిసిపోయింది.
అయితే అతడిపై యువతి కోపం పెంచుకుంది. తన మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోలనుకుంది. దీనికి స్నేహితులైన మహేందర్ యాదవ్, దీక్షిత్ రెడ్డి, ప్రణీత్, సూర్యతేజ సాయం కోరింది. అందులో భాగంగా మహేందర్ సోమవారం శ్రవణ్ కు ఫోన్ చేశాడు. జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ కు రావాలని, అక్కడ రింకీతో మాట్లాడి ఇద్దరి మధ్య ఏర్పడిన సమస్యను పరిష్కరించుకోవాలని కోరాడు. దీనికి శ్రవణ్ అంగీకరించాడు. జూబ్లీహిల్స్ కు కారులో వెళ్లి మహేందర్ తో ఉన్న మిగిలిన స్నేహితులను కలిశాడు.
ఇందులో దీక్షిత్, ప్రణీత్, సూర్యతేజ కారులో కూర్చొని కృష్ణకాంత్ పార్కుకు వెళ్లగా మహేందర్, రింకీ బైక్ పై వచ్చారు. అనంతరం వారంతా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని పబ్ కు వెళ్లారు. అయితే పబ్ లోకి వెళ్లిన తర్వాత రింకీతో పాటు మరో నలుగురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనుమానం వచ్చిన శ్రవణ్ తన కారు వద్దకు వెళ్లి వాహనాన్ని తనిఖీ చేశాడు. అందులో గంజాయిని ప్యాకెట్ లో నింపి వెనుక సీట్లో ఉంచినట్టు గుర్తించాడు.
వీటిని మహేందర్ తదితరులు కారులో పెట్టి ఉంటారనే అనుమానంతో శ్రవణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఇందులో శ్రవణ్ ను తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన్నట్టు అంగీకరించిన రింకీ, ఆమె స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రవణ్ తనను మోసం చేశాడని, అందుకే గంజాయి కేసులో ఇరికించాలని ప్లాన్ వేశానని యువతి పోలీసులకు తెలిపింది.