ఖమ్మంలో హృదయవిదారక ఘటన... కష్టపడి పండించిన ధాన్యాన్ని కాపాడుకోబోయి యువరైతు బలి

Arun Kumar P   | Asianet News
Published : May 09, 2022, 11:44 AM ISTUpdated : May 09, 2022, 11:48 AM IST
ఖమ్మంలో హృదయవిదారక ఘటన... కష్టపడి పండించిన ధాన్యాన్ని కాపాడుకోబోయి యువరైతు బలి

సారాంశం

ఎంతో కష్టపడి పండించిన పంట కళ్లముందే తడిసిపోతుంటే తట్టుకోలేకపోయిన యువరైతు కాపాడుకునేందుకు ప్రయత్నించగా.., పిడుగుపాటుకు గురయి మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. 

ఖమ్మం: ఆరుగాలాలు కష్టపడి పండించిన పంట కళ్లముందే పాడయిపోతుంటే ఆ యువ రైతు తట్టుకకోలేకపోయాడు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండటంతో ధాన్యం తడవకుండా చూసేక్రమంలో చివరకు తన ప్రాణాలు కోల్పోయాడు. జోరు వర్షంలో ధాన్యంపై పట్టా కప్పుతుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో యువరైతు మృతిచెందాడు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.  

ఖమ్మం జిల్లా వేంసూరు మండలానికి చెందిన యువ రైతు సాగర్(24) వరి పండించాడు.  ఇటీవలే వరికోత జరిపి వడ్లను అమ్మకానికి సిద్దం చేసాడు. ఈ క్రమంలోనే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో వరి ధాన్యం తడవకుండా పట్టా కప్పేందుకు వెళ్లాడు. ఇలా వర్షంలోనే ధాన్యంపై పట్టా కప్పుతుండగా ఒక్కసారిగా అతడిపై పిడుగు పడింది. దీంతో యువరైతు శరీరమంతా కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. 

చిన్నవయసులో తల్లిదండ్రులకు ఆసరాగా వుడేందుకు వ్యవసాయం చేస్తున్న సాగర్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారు. అతడి కుటుంబసభ్యులు కూడా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

ఇదిలావుంటే మరో మూడురోజుల పాటు తెలంగాణలో ఇలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు, రైతులు అప్రమత్తంగా వుండాలని వాతావరణ  శాఖ హెచ్చరించింది. 

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని... ఈ ఆవర్తనం నుంచి కర్ణాటక వరకు వరకు గాలుల్లో ఏర్పడిన అస్థిరత కారణంగా ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ కేంద్రం వివరించింది. ఈ ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడిందని వాతావరణ శాఖ చెప్పింది. రాగల 12 గంటల్లో తూర్పు బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం వెల్లడించింది. శ్రీకాకుళం, ఒడిశా తీరం మధ్య ఈ నెల 10వ తేదీన తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో అసని తుపాను కదులుతోంది. అయితే తుపాన్ ప్రభావం అంత తీవ్రంగా ఉండదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనేక చోట్ల వర్షాలు పడతాయని..  గంటకు 30 నుంచి 40  కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

 

 

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు