
భద్రాచలం: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, పోలీసులు మరెంత కఠినంగా వ్యవహరించినా మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారు. ఈ కంప్యూటర్ యుగంలోనూ అమ్మాయి ఇంట్లోంచి బయటకు వెళ్లిందంటే క్షేమంగా ఇంటికి చేరేవరకు తల్లిదండ్రులు కంగారు పడుతుంటారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏ మృగాడు ఎప్పుడు, ఎందుకు, ఎలా దాడిచేస్తాడో తెలియని పరిస్థితి, ప్రేమ పేరుతో కొందరు, కామంతో రగిలిపోయి మరికొందరు, వారివరసలు మరిచి ఇంకొందరు అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ మైనర్ బాలికను ప్రేమపేరుతో నమ్మించి గర్భవతిని చేసాడో దుర్మార్గుడు.
వివరాల్లోకి వెళితే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందపల్లికి గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన బాణాల సురేష్ కన్నేసాడు. బాలికకు ప్రేమిస్తున్నానంటూ వెంటపడి మాయమాటలతో దగ్గరయ్యాడు. అతన్ని పూర్తిగా నమ్మిన బాలిక పెళ్ళిచేసుకుంటాడని నమ్మి శారీరకంగా కూడా దగ్గరయ్యింది.
అయితే బాలిక ఇటీవల అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్లు అన్ని టెస్టులు చేసి బాలిక గర్భం దాల్చినట్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కూతురిని నిలదీయగా సురేష్ తో ప్రేమాయణం గురించి బయటపెట్టింది. వారు తమ కూతురుని పెళ్లిచేసుకోవాలని సురేష్ ని కోరగా అందుకతడు నిరాకరించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు దమ్మన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు.
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన సురేష్ పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు. అలాగే తమ బిడ్డకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన బాలిక కుటుంబసభ్యులను కులం పేరుతో దూషించిన సురేష్ తల్లిదండ్రులు, నాన్నమ్మపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు. గర్భవతిని చేసిన సురేష్ తోనే తమ కూతురి పెళ్ళిచేసి న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతోంది.
ఏపీలో కూడా తాజాగా ఇలాంటి దారుణమే వెలుగుచూసింది. గత నాలుగు నెలలుగా మైనర్ బాలికపై ఇద్దరు వృద్దులు అత్యాచారానికి పాల్పడుతుండటంతో బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తిరుపతి జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.
తిరుపతి జిల్లా దక్కిలి మండలం నాగవోలు పంచాయితీ మహాసముద్రం గ్రామానికి చెందిన మైనర్ బాలికపై శ్రీరాం సుబ్బయ్య(55), భాస్కర్(60) అనే ఇద్దరు వృద్దులు కన్నేసారు. బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తమకు క్షుద్రపూజలు చేయడం వచ్చని... తాము చెప్పినట్లు వినకపోతే తల్లిదండ్రులను చంపేస్తామని బెదిరించారు. దీంతో భయపడిపోయిన బాలిక వారి నీచానికి పాల్పడుతున్నా మౌనంగా వుంది. ఇలా బాలికను బెదిరించి గత నాలుగు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. తల్లిదండ్రులు నిలదీయగా వృద్దులిద్దరి పేరు బయటపెట్టింది.
తమ కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు వృద్దులపై తల్లిదండ్రులు దక్కిలి పోలీసులకు ఫిర్యాదు చేసారు. వారిపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మనవరాలి వయసు బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.