
Kethepalli Road accident: ఓ వివాహానికి హాజరయ్యేందుకు అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ఓ యువతి అమెరికా వెళ్లేలోపే రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల శివారులో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన కరణం పద్మనాయుడు కుటుంబం కొన్నేళ్ల క్రితం అమెరికాలో స్థిరపడింది. ఇటీవల వారి బంధువుల కుటుంబంలో వివాహం జరిగింది. అయితే ఈ పెళ్లికి పద్మనాయుడు కూతురు ప్రీతి వచ్చింది. పెళ్లి వేడుకలన్నీ అయిపోయాక ఆమె అమెరికా వెళ్లిపోవాలి. శనివారం రాత్రి ఆమెకు హైదరాబాద్‌లో విమానం ఉంది. అయితే ఆమెను ఎయిర్‌పోర్టులో దింపేందుకు దగ్గరి బంధువులంతా కారులో బయలుదేరారు.
వీరి కారు విజయవాడ నుంచి నల్లగొండ జిల్లాకు చేరుకుంది. అక్కడి నుంచి హైదరాబాద్ కు వస్తుండగా కడెంగూడెం శివారు వద్దకు రాగానే సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న గుర్తుతెలియని వాహనం అతివేగంగా వచ్చి కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు జాతీయ రహదారిపై మూడుసార్లు బోల్తా పడింది. తలకు బలమైన గాయమైన కరణం ప్రీతి (21) అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న దొప్పలపూడికి చెందిన శ్రేయస్, అందులో ప్రయాణిస్తున్న చేకూరి సరిత, దివి విశ్వవిఖ్యాత్, దివి పద్మావతి తీవ్రంగా గాయపడ్డారు.
ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కేతేపల్లి ఏఎస్సై ఎన్.శ్రీనివాస్ తెలిపారు.