టీఎస్‌పీఎస్‌సీని ప్ర‌క్షాళను చేయాలి.. కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేయాలి.. : కాంగ్రెస్

By Mahesh RajamoniFirst Published Mar 20, 2023, 2:06 AM IST
Highlights

Hyderabad: టీఎస్‌పీఎస్‌సీని ర‌ద్దు చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రప‌తిని కోరింది. పలు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీని అడ్డుకోవడంలో ప్ర‌భుత్వం విఫలమైంద‌నీ, సీఎం కేసీఆర్ పేపర్ లీకేజీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల అమ్మకానికి తెరలేపారంటూ ఆరోపించింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వెంట‌నే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
 

TSPSC paper leak: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ప‌రీక్ష‌ల పేప‌ర్ల లీకేజీ వ్య‌వ‌హారం రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ప్ర‌తిప‌క్ష పార్టీలు అధికార బీఆర్ఎస్ స‌ర్కారును టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌ల దాడి చేస్తున్నాయి. నిరుద్యోగులు ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ప‌రీక్ష‌ల పేప‌ర్ల లీకేజీపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలోని భార‌త రాష్ట్ర స‌మితి స‌ర్కారుపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. పేప‌ర్ల లీకేజీ వ్య‌వ‌హారంలో అధికార పార్టీ నాయ‌కుల హ‌స్తం ఉంద‌నీ, టీఎస్‌పీఎస్‌సీని ర‌ద్దు చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రప‌తిని కోరింది. పలు పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీని అడ్డుకోవడంలో ప్ర‌భుత్వం విఫలమైంద‌నీ, సీఎం కేసీఆర్ పేపర్ లీకేజీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల అమ్మకానికి తెరలేపారంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వెంట‌నే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) పేపర్ లీకేజీ వ్యవహారంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలనీ, ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సమీర్ వలీవుల్లా మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ బీ.జనార్దన్ రెడ్డితో పాటు సభ్యులందరినీ తొలగించి వారి స్థానంలో కొత్త బోర్డును నియమించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ నేతలు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

 

| Congress workers carry out a protest rally from Gandhi Bhavan to Raj Bhavan in Hyderabad over Adani row. pic.twitter.com/BzNLREfanj

— ANI (@ANI)

 

పేపర్ లీకేజీ, మూడు పరీక్షల రద్దు వేలాది మంది అభ్యర్థుల కలలను ఛిన్నాభిన్నం చేశాయని సమీర్ అన్నారు. ఇది అభ్యర్థులను తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందనీ, వారికి జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలన్నారు. సిరిసిల్లకు చెందిన గ్రూప్-1 అభ్యర్థి నవీన్ ఆత్మహత్యను ప్ర‌స్తావిస్తూ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నవీన్ హత్యకు కారణమైన పేపర్ లీకేజీకి కారకులైన వారందరిపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే ఆశతో అభ్యర్థులు నెలల తరబడి కష్టపడి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. అయితే, టీఎస్‌పీఎస్‌సీ నేరపూరిత నిర్లక్ష్యం, కేసీఆర్ ప్రభుత్వ అలసత్వ వైఖరి వల్ల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయనీ, ఫలితంగా లక్షలాది మంది విద్యార్థుల శ్రమ వృథా అయిందన్నారు. సంబంధిత మంత్రులందరినీ కేసీఆర్ తొలగించి ఉండాల్సిందనీ, టీఎస్‌పీఎస్‌సీ బోర్డు మొత్తం తమ పదవుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు.

అసలు దోషులను కాపాడేందుకు దృష్టి మరల్చేందుకే కేటీఆర్ ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ సంబంధం లేకుండా దోషులను శిక్షించాలని అన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబం తెలంగాణను దోచుకుంటున్నారనీ, ఆస్తులు, వనరులను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పలు పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీని అడ్డుకోవడంలో విఫలమై పేపర్ లీకేజీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల అమ్మకానికి అవకాశం కల్పించార‌నీ, సీఎం కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలో కేటీఆర్ వ్యక్తిగత సహాయకుడిదే కీలక పాత్ర అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న  టీఎస్‌పీఎస్‌సీ కాంట్రాక్ట్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డితో కేటీఆర్ వ్యక్తిగత సహాయకుడు తిరుపతికి సంబంధాలున్నాయని ఆరోపించారు. కేటీఆర్ కార్యాలయం నుంచి పేపర్ లీకేజీ జరిగిందని ఆయన పేర్కొన్నారు.

click me!