పాలమూరు రైతులను దెబ్బకొట్టిన అకాల వర్షాలు.. భారీగా పంట‌ నష్టం

By Mahesh RajamoniFirst Published Mar 20, 2023, 2:44 AM IST
Highlights

Palamuru: వడగళ్ల వానతో కురిసిన వర్షాలకు మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వరి, మామిడి, మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. అకాల వ‌ర్షాలు పాల‌మూరు రైతుల‌కు భారీ న‌ష్టాల‌ను తెచ్చిపెట్టాయి. 
 

Unseasonal rainfall: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 5 జిల్లాల్లో వివిధ పంటలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. రైతుల‌కు తీవ్ర‌ నష్టం వాటిల్లింది. అకాల వర్షాలకు మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాలతో కూడిన పాలమూరు ప్రాంత వ్యాప్తంగా వరి, మామిడి, మొక్కజొన్న, కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వడగండ్ల వానకు కోతకు సిద్ధంగా ఉన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

వందలాది ఎకరాల్లో మామిడి, మొక్కజొన్న, మిరప, ఉల్లి, వరి తదితర పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వడగళ్ల వానతో పాటు వేగంతో వీచిన గాలులతో మామిడి పంట తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ది. వివిధ ప్రాంతాల్లోని హార్టికల్చర్‌ తోటల్లో కోతకు సిద్ధంగా ఉన్న ఉల్లి రైతుల‌కు అకాల వ‌ర్షాలు లక్షల రూపాయల నష్టాల‌ను తెచ్చిపెట్టాయి. భారీ వర్షాలు, వడగళ్ల వానలతో పాలమూరు ప్రాంత వ్యాప్తంగా పంట నష్టపోయిన వరి రైతులు ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు. జిల్లాలో 3.2 లక్షల ఎకరాల్లో వరి పంట వేసినట్లు అంచనా. నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించినా, నీటి ఎద్ద‌డి ప‌రిస్థితుల‌కు నిలబడి పంటలు పండిన వారికి మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే, మామిడి, ఉల్లి, కూరగాయల తోటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది.

వడగండ్ల వానకు పలు పండ్ల తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి.  ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు వడగళ్ల వాన ప్రారంభమైంది. వడగండ్ల వానకు మామిడి కాయలు నేలకొరగడంతో గండీడ్ మండలంలో మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని హన్వాడ, బాలానగర్, నవాబుపేట మండలాల్లో కూరగాయల పంటలు వేసిన రైతులు కూడా అకాల వర్షాలకు నష్టపోయారు. అకాల వర్షాలతో వ్యవసాయ రంగం మాత్రమే కాకుండా ఇటుక బట్టీలు వంటి వ్యాపారాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాలకు నారాయణపేట, గద్వాల, బల్మూర్, వనపర్తి మండలాల్లోని మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్క జడ్చర్ల నియోజకవర్గంలోనే వెయ్యి ఎకరాలకు పైగా మామిడి తోటలు నాశనమై ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్ లో మామిడి పంటకు తక్కువ దిగుబడులు వచ్చాయనీ, అకాల వర్షాలకు పూత‌, మామిడి పిందె రాలిపోవ‌డంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

సరైన దిగుబడులు రాకపోవడంతో రైతులు ఆందోళ‌న‌లో ఉండగా, ప్ర‌స్తుతం కురుస్తున్న అకాల వర్షాలు బీభత్సం సృష్టించడంతో ఈ సీజన్ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే పెట్టుబడి కోసం రుణాలు తీసుకున్న రైతులు భారీ వడ్డీలతో ఆ రుణాలను చెల్లిస్తుండగా అకాల వర్షాలు తమ పంటలను ముంచేస్తున్నాయ‌ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

click me!