హైదరాబాద్ లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. కుళ్లిపోయిన స్థితిలో ఆమె మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో వివాహిత హత్యకు గురైన ఘటన జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం…నెల్లూరు జిల్లా కొత్తపల్లికి చెందిన ప్రసాద్ (35) ఎల్లమ్మబండ దత్తాత్రేయనగర్ లో గత ఆరు నెలలుగా ఓ గదిని అద్దెకు తీసుకుని ఒక్కడే ఉంటున్నాడు. పలుచోట్ల కుక్ గా పనిచేసే ప్రసాద్ ఉదయం వెళ్లి రాత్రి ఇంటికి వస్తుండేవాడు. కాగా, శిరీష అనే మహిళ ప్రతి పది రోజులకు ఒకసారి ప్రసాద్ ఉంటున్న గది దగ్గరికి వచ్చి వెడుతుండేది.
ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ప్రసాద్ కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత ప్రసాద్ తాను ఉంటున్న గదికి పక్కనే ఉండే వారికి సోమవారం నాడు ఫోన్ చేసి తన గదిలో శిరీష చనిపోయి ఉందని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో అతడి గది వద్దకు వెళ్లగా తీవ్ర దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... తలుపులు తెరిచి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం లభించింది. చుట్టుపక్కల పరిశీలించగా గోడపై రక్తపు మరకలు ఉన్నాయి. దీంతో ఆమె తలను గోడకు కొట్టడం వల్ల మృతి చెంది ఉండవచ్చని… రెండు మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రసాద్ గదిలో లభ్యమైన మహిళ ఫోటో..
పోలీసులు నిందితుడిగా భావిస్తున్న ప్రసాద్ ఉంటున్న గదిలో తనిఖీలు చేపట్టగా మృతురాలు శిరీష ఫోటో లభ్యమైంది. ఓ ప్రణాళిక ప్రకారమే ఆమె ఫోటో ఉంచి ఉంటాడని పోలీసులు తెలుపుతున్నారు. కాగా, శిరీషనను కొందరు ప్రసాద్ భార్య అని చెబుతుండగా.. మరి కొందరు భార్య అయితే పది రోజులకు ఒకసారి ఎందుకు వస్తుందని పేర్కొంటున్నారు. ప్రసాద్ కు సదరు మహిళకు ఉన్న సంబంధంపై పూర్తి వివరాలు తెలియరాలేదు. ఆమె ఎక్కడ ఉంటుందన్న విషయం సైతం ఎవరికీ తెలియదు.. అని పోలీసులు చెబుతున్నారు. అసలు ఎందుకు హత్య చేసి ఉంటాడో.. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.