
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఫ్లై ఓవర్ మరణాలు ఆగడం లేదు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీది నుంచి పడడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్వీటీ పాండే(22) అనే కోల్కతాకు చెందిన ఓ యువతి స్నేహితుడు రాయన్ ల్యుకేతో జేఎన్టీయూ నుంచి కలిసి హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ మీదుగా ఐకియా వైపు టూ వీలర్ మీద వెళ్తున్నారు.
రాయన్ ల్యుకే వాహనాన్ని అతివేగంగా నడుపుతుండడంతో అదుపుతప్పి హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పై గోడను ఢీ కొట్టింది. దీంతో బైక్ వెనక కూర్చున్న స్వీటీ పాండే ఒక్కసారిగా ఎగిరి పడింది. అలా గాల్లోకి ఎగిరిన స్వీటీ పాండే ఫ్లై ఓవర్ మీది నుంచి రోడ్డుపై పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు రాయన్ ల్యుకే కూడా గోడను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి.
ఇది గమనించిన అక్కడివారు వెంటనే ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు వీరికి చికిత్స మొదలుపెట్టారు. కానీ అక్కడ చికిత్స తీసుకుంటూ స్వీటీ పాండే మృతి చెందింది. ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకున్నామని మాదాపూర్ పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, గతనెలలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ నుంచి ఓ వాహనదారుడు కిందపడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జూలై 23 రాత్రి చోటుచేసుకుంది. ఆ రాత్రి ఇద్దరు యువకులు టూ వీలర్ మీద ఫ్లైఓవర్ మీదుగా వెళుతున్నారు. వేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొట్టారు.
దీంతో ఒక ఫ్లై ఓవర్ మీది నుంచి మరో ఫ్లై ఓవర్ మీదికి వారిద్దరు పడిపోయారు. బైక్ మీద వెళుతున్న ఇద్దరిలో ఒకరు ఈ ఘటనలో తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయాలైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చనిపోయిన వ్యక్తిని గచ్చిబౌలి నివాసి మధు (25)గా గుర్తించారు.
ప్రమాదానికి సంబంధించిన సమాచారం తెలియడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.
క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మధు మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.