పెద్దపల్లి జిల్లాలో గోదాావరిఖని ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలింత హాస్పిటల్ బాత్రూలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
పెద్దపల్లి: పెళ్లయిన పదేళ్లకు కడుపుపండటంతో ఆమె ఎంతో ఆనందపడింది. ఎన్నో ఏళ్ల ఎదురుచూపుల తర్వాత కల నెరవేరి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. బిడ్డకు జన్మనిచ్చిన హాస్పిటల్లోనే ఆమె బలవన్మరణానికి పాల్పడిన విషాదం పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా (peddapalli district) కమాన్ పూర్ మండలం రొంపికుంట (rompikunta) గ్రామానికి చెందిన గుమ్మడి ఉమకు 2009లో వివాహం జరిగినా ఇంతకాలం సంతానంయోగం కలగలేదు. పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆమె మొరను ఆ దేవుడు ఆలకించాడో ఏమో ఈ ఏడాది ఆరంభంలో ఆమె గర్భం దాల్చింది.
undefined
Video
అయితే చాలాకాలం తర్వాత గర్భం దాల్చడంతో భర్త, కుటుంబసభ్యులు ఉమను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. నెలలు నిండిన ఉమ డిసెంబర్ 11వ తేదీన గోదావరిఖని శారదా నగర్ లోని వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ చేర్పించారు. సాదారణ ప్రసవం సాధ్యంకాకపోవడంతో తర్వాతి రోజు అంటే డిసెంబర్ 12న డాక్టర్లు ఆపరేషన్ చేసారు. ఇలా ఉమ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మగ బిడ్డను ప్రసవించడంతో ఆమె భర్తతో పాటు కుటుంబసభ్యులు ఆనందించారు.
read more భర్త మీద కోపంతో కుమారుడికి నిప్పు.. తానూ అంటించుకుని ఆత్మహత్య
కానీ ఈ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. ఆపరేషన్ తర్వాత వేసిన కుట్లు మానకపోవడంతో పాటు తీవ్ర బాధను అనుభవించింది ఉమ. ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల ఆమె కడుపు నొప్పితో నరకం చూసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కారణమేమిటో తెలీదు గానీ బిడ్డను ప్రసవించిన హాస్పిటల్ లోనే ఉమ బలవన్మరణానికి పాల్పడింది.
ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున హాస్పిటల్ మెటర్నిటీ వార్డులోని బాత్రూంలోకి వెళ్లింది ఉమ. తన దగ్గరున్న చున్నీతో ఆ బాత్రూంలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూంలోకి వెళ్లిన ఆమె ఎంతకూ బయటకు రాకపోవడంతో కంగారుపడిపోయిన కుటుంబసభ్యులు అనుమానంతో వెళ్లిచూసారు.కానీ అప్పటికే ఆమె ఉరికి వేలాడుతూ ప్రాణాలు కోల్పోయింది.
హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఉమ ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ సిబ్బంది సమాచారంతో ఇవ్వడంతో హాస్పిటల్ కు చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. హాస్పిటల్ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని కిందకు దింపి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
read more అక్క కుటుంబానికి దగ్గరై మెప్పు పొందాలని.. కోడలి కిడ్నాప్.. చివరికి అరెస్టై జైలుకు.. ఎక్కడంటే...
ఇలా ఎన్నోఏళ్ల నిరీక్షణ తర్వాత తల్లిగా మారిన ఉమ ఆనందం పట్టుమని ఇరవై రోజులు కూడా నిలవలేదు. ఆమె మృతి కుటుంబంలోనే కాదు రొంపికుంటలో కూడా విషాదాన్ని నింపింది. బాలింత మృతికి కారణమైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)