
హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల నిర్ణయం చాలా మందిని ఆలోచనల్లో పడేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి 22 వరకు నిర్వహించే ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’(One Nation, One Election/ONOE) బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. ఈ బిల్లు ప్రభావం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందా అనే చర్చ మొదలైంది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈ జమిలి ఎన్నికల బిల్లు ప్రభావం పడే అవకాశం ఉన్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా ఈ బిల్లు గురించిన వివరాలేవీ బయటకు రాలేవు. ఈ బిల్లుకు తుది మెరుగులు దిద్దుతున్న ఈ సందర్భంలో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దాని ప్రభావం గురించి అస్పష్టత ఉన్నది. మరో వారం రోజుల్లో ఈ బిల్లు గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.
తెలంగాణ దాదాపు ఎన్నికల మూడ్‌లోకి వచ్చేసింది. బీఆర్ఎస్ దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో ఇతర పార్టీలు అభ్యర్థల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. బరిలోకి దూకడమే తరువాయి అనేంతగా పరిస్థితులు మారాయి. మూడు పార్టీల అభ్యర్థులు ఖరారయ్యాక క్యాంపెయిన్ దాదాపు మొదలైపోతుంది. ఈ డిసెంబర్‌లో ఎలక్షన్స్ ఉంటాయని చాలా మంది భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ సహా ఇతర పార్టీల అధినేతలు, నేతలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. కానీ, కేంద్రం ప్రత్యేక పార్లమెంటు సమావేశాల నిర్ణయాన్ని ముందుకు తేవడంతో చర్చ ఉమ్మడి ఎన్నికలపైకి మళ్లుతున్నది.
వాయిదానా? ముందస్తా?
2014లో ఆవిర్భవించిన తెలంగాణలో రెండో సారి అసెంబ్లీ ఎన్నికలు లోక్ సభతోపాటుగా జరగలేవు. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. 2018 డిసెంబర్‌లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ సారి కూడా అదే నెలలో జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ, కేంద్రం జమిలి ఎన్నికల మాట ఎత్తుతుండటంతో ఈ ఎన్నికల తేదీపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సాధారణంగా అసెంబ్లీ కాలం ముగిసిన తర్వాత ఆరు నెలల్లోపు కొత్త ప్రభుత్వం కొలువుదీరాలి. ఇప్పుడు ఈ ఆరు నెలల వ్యవధే కేంద్రానికి కీలకంగా మారనుంది. తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గడ్, మిజోరం అసెంబ్లీలకు ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలనే నిర్ణయం తీసుకుని.. వాటిని వాయిదా వేసి లోక్ సభ ఎన్నికలతో కలిపి నిర్వహించే అవకాశం ఉన్నది. లేదంటే.. లోక్ సభను ముందస్తుగా రద్దు చేసి ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు నిర్వహించే పాజిబిలిటీ ఉన్నది. ఈ జమిలిలో మిగిలిన రాష్ట్రాలను ఇప్పుడే చేరుస్తారా? ఉదాహరణకు కర్ణాటకకు ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇలాంటి రాష్ట్రాలను కూడా ఇప్పుడే చేరుస్తారా? లేక వాటన్నింటికీ ఒక తేదీని నిర్ణయించి ఎన్నికలు నిర్వహించి భవిష్యత్‌లో వాటిని కూడా జమిలిలో కలిపేస్తారా? అనేదానిపై మరికొన్ని రోజులకు తెలుస్తుంది.
Also Read: జమిలి ఎన్నికలు ఇప్పుడు లేనట్లే.. ఆ విధానంతో లాభాలు, నష్టాలూ ఉన్నాయ్: రాజ్యసభలో కేంద్రం
జమిలి ఎన్నికల బిల్లు సులువుగానే..
ఈ ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికలతోపాటు జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడం, మహిళా రిజర్వేషన్ వంటి బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని కొన్ని కథనాలు వచ్చాయి. జమిలి ఎన్నికల బిల్లును మోడీ ప్రభుత్వం లోక్ సభలో సులువుగా నెగ్గించుకోగలదు. కానీ, రాజ్యసభలో మాత్రం మిత్రపక్షాల మద్దతు అవసరం. ఈ బిల్లుకు ఓటేయడానికి వైఎసీపీ, బీజేడీ పార్టీలకు అభ్యంతరాలేవీ ఉండకపోవచ్చు. కానీ, ఏకకాలంలో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ బిల్లును ప్రభుత్వం సులువుగానే పాస్ చేయంచుకోవచ్చు. అయితే.. దీనికి రాజ్యాంగపరమైన సవరణ అవసరం. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు సుప్రీంకోర్టునూ ఆశ్రయించవచ్చు. సుప్రీంకోర్టు జమిలి ఎన్నికలపైనా విచారించే స్కోప్ ఉన్నది.
Also Read: బీజేపీ మినీ జమిలి వ్యూహం.. తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలతో అందుకే సన్నిహితం?
ఒక వేళ ఎన్నికలు వాయిదా పడితే ఇక్కడి పార్టీల వైఖరి ఎలా ఉంటుందనేది మరింత ఆసక్తిగా మారింది. జమిలి ఉండదనే విశ్వాసంతోనే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారని అర్థం చేసుకోవచ్చు. తద్వార బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీలపై పై చేయి సాధించారు. కానీ, ఈ స్పెషల్ సెషన్ బీఆర్ఎస్ ను గందరగోళంలోకి నెట్టిందని అనుకోవచ్చు. లోక్ సభ ఎన్నికలతో సమాంతరంగా రాష్ట్ర ఎన్నికలు జరగవద్దని కేసీఆర్ భావిస్తారు. అందుకే ఆయన ముందస్తుకు వెళ్లారు. ఘన విజయం సాధించారు.