Hyderabad: అకాల వర్షాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పెద్దమొత్తంలో వరి పంట దెబ్బతిన్నది. అయితే, రాష్ట్ర రైతాంగానికి అండగా ఉంటామనీ, ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తెలిపారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలనీ, అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Telangana cm K Chandrasekhar Rao (KCR): అకాల వర్షాలతో దెబ్బతిన్న వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రైతాంగానికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. వర్షాలకు తడిసిన వరి ధాన్యం గురించి రైతులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. కొనుగోళ్ల సమయంలో సాధారణ ధాన్యానికి చెల్లించిన ధరతో సమానంగా దెబ్బతిన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని పరిరక్షించడం, రైతులను కష్టాల నుంచి కాపాడడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇటీవల కాలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో యాసంగి వరి కోతలను మార్చిలోగా పూర్తి చేసేలా ఎలాంటి విధానాలు అవలంబించాలో అధ్యయనం చేసి ఈ దిశగా రైతులను చైతన్యపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. మరో మూడు, నాలుగు రోజులు కోతలను వాయిదా వేయాలని రైతులకు కేసీఆర్ సూచించారు.
యాసంగి ధాన్యం, తడిసిన ధాన్యం కొనుగోళ్లు, భవిష్యత్తులో యాసంగి ధాన్యం త్వరగా కోయడానికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యవసాయ శాఖ కార్యకలాపాలు తదితర అంశాలపై మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు హరీశ్ రావు, వీ.శ్రీనివాస్ గౌడ్, జీ.జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి కార్యదర్శులు స్మితా సబర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
undefined
వ్యవసాయాభివృద్ధి, రైతు కుటుంబాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అపూర్వమైన ప్రయోజనాలను అందిస్తున్నాయనీ, రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. వరి ఉత్పత్తిలో తెలంగాణ పలు రాష్ట్రాలను అధిగమించింది. ప్రభుత్వం రైతుల నుంచి ప్రతి వరి గింజను కొనుగోలు చేస్తుందన్నారు. రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో, దృఢ సంకల్పంతో కార్యాచరణను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో కురిసిన అకాల వడగండ్ల వానలు, వర్షాలు దురదృష్టకరమన్నారు. ప్రకృతి వైపరీత్యాలపై నియంత్రణ లేదన్నారు. రాష్ట్ర ఖజానాపై పెనుభారం ఉన్నప్పటికీ ఇప్పటికే వడగళ్ల వానకు పంట నష్టపోయిన రైతులను ఎకరాకు రూ.10 వేలు అందించి ఆదుకుంటోందన్నారు. వర్షాల కారణంగా యాసంగి వరి పంట దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల కష్టాలను పరిగణనలోకి తీసుకుందనీ, విపత్కర సమయంలో బాధిత రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న యాసంగి ధాన్యం కొనుగోళ్ల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అకాల వర్షాల కారణంగా కొనుగోళ్లలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని అధికారులు కేసీఆర్ కు వివరించారు. అన్ని ఏర్పాట్లతో త్వరలోనే కొనుగోళ్లు పూర్తి చేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో మరో మూడు, నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం తడిసిపోకుండా వరి కోతలు నిలిపివేయాలని రైతులకు కేసీఆర్ సూచించారు.