
TPCC President Revanth Reddy: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి ఎన్నికల సంఘం గుర్తింపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పై తాను వేసిన కేసును పరిష్కరించే వరకు బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)ని గుర్తించవద్దని ఆయన భారత ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇదివరకు రేవంత్ రెడ్డి.. ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించి పార్టీ నిధులు వసూలు చేశారంటూ 2018లో అధికార పార్టీ నేతలపై ఫిర్యాదు చేశారు. "2018లో నేను వేసిన కేసులో తీర్పు వెలువడితే టీఆర్‌ఎస్ గుర్తింపు పోతుంది. 2018లో కేసీఆర్ ప్రారంభించిన నిధుల సమీకరణ పేరుతో టీఆర్‌ఎస్ నాయకులు గులాబీ కూలీ పేరుతో వందల కోట్లు వసూలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నిధుల వసూళ్లకు పాల్పడితే నేరం అవుతుందనీ, అది లంచం తీసుకోవడంతో సమానమని" పేర్కొన్నారు.
అధికార పార్టీ నిధుల సేకరణను పరిశీలించాలని ఢిల్లీ కోర్టు ఈసీని కోరినప్పటికీ టీఆర్‌ఎస్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
టీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు..
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పార్టీలు ₹ 20,000 కంటే ఎక్కువ విరాళాలను నగదు రూపంలో తీసుకోలేవనీ, 'గులాబీ కూలీ' కింద సేకరించిన నిధుల గురించి టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి తెలియజేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. "నేను ప్రధానికి ఫిర్యాదు చేశాను. దానిని హోంమంత్రికి పంపాను. తర్వాత టీఆర్‌ఎస్ సేకరించిన నిధులపై విచారణ కోసం సీబీడీటీకి ఫిర్యాదు కూడా చేశాను అని" తెలిపారు. తీర్పు వస్తే టీఆర్‌ఎస్ గుర్తింపు కోల్పోయే అవకాశం ఉన్నందున పెండింగ్‌లో ఉన్న కేసును పరిష్కరించే వరకు బీఆర్‌ఎస్‌ను గుర్తించవద్దని ఈసీని ఆదేశించాలని కోరుతూ మళ్లీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు. అవినీతి ఆరోపణల్లో బీజేపీకి మద్దతివ్వడం వల్లే టీఆర్ఎస్ సేఫ్ గా ఉందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ను మట్టికరిపించేందుకు టీఆర్‌ఎస్, బీజేపీ రెండూ కలిసి పశ్చిమ బెంగాల్ తరహా పరిస్థితిని సృష్టించాలని భావిస్తున్నాయని చెప్పారు.
తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర..
ఇదిలావుండగా, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర త్వరలోనే తెలంగాణలోకి ప్రవేశించనుంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ మాజీ ప్రధాని వర్ధంతి రోజైన అక్టోబర్ 31న నెక్లెస్ రోడ్‌లోని తన అమ్మమ్మ ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులో ఆమె వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తామనీ, అందులో రాహుల్ గాంధీ పాల్గొంటారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ. రేవంత్‌రెడ్డి తెలిపారు. 'భారత్ జోడో యాత్ర'లో ఉన్న కాంగ్రెస్ ఎంపీ అక్టోబర్ 23 ఉదయం 7 గంటలకు మక్తల్‌లో తెలంగాణలోకి ప్రవేశించనున్నారు. మరికొద్ది రోజుల్లో యాత్ర తుది రూట్ మ్యాప్ వెల్లడికానుంది.
మునుగోడు ఉప ఎన్నిక..
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా భోంగీర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రచారంలో పాల్గొంటారనీ, పార్టీ హైకమాండ్ పనిలో ఉందని ఆదివారం ఏఐసీసీ కార్యదర్శులతో జరిగిన సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి తెలిపారు. నల్గొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉప ఎన్నికలో ఆయన ప్రచారం చేస్తారని అన్నారు. అలాగే, పార్టీ ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు పార్టీ మారబోతున్నారంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. త్వరలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు పార్టీని వీడతారని, పార్టీలో కోవర్టులు లేరని, మంత్రిగా ఉన్నందున తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దంటూ ఎత్తిచూపారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు వెంకట రెడ్డి కృషి చేస్తారని విక్రమార్క తెలిపారు. పార్టీ ప్రచారానికి దూరంగా ఉన్న ఎంపీపై చర్యలు తీసుకోవాలని పార్టీలో ఎవరూ డిమాండ్ చేయలేదన్నారు. మునుగోడులో కాంగ్రెస్ నేతలు ఐక్యంగా పనిచేస్తారని చెప్పిన రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలంతా అక్టోబర్ 14 వరకు మునుగోడులో ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. తాను రాజీనామా చేస్తే అభివృద్ధి చేస్తానని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెబుతున్న మాటలు అబద్ధమని తేలితే కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు.