
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సీఎం కేసీఆర్ శుభవార్త తెలిపారు. త్వరలోనే పీఆర్సీ వేస్తామని, అలాగే, మధ్యంతర భృతిని కూడా ప్రకటిస్తామని వివరించారు. అసెంబ్లీలోని సీఎం ఆఫీసులో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఉద్యోగులు, పింఛను దారుల ఆరోగ్య పథకాన్ని పక్కాగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం ఐకాస చైర్మన్ రాజేందర్, ప్రధాన కార్యదర్శి వి మమత, టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ సహా మరికొందరు సీఎం కేసీఆర్‌తో గురువారం సమావేశమయ్యారు. వారితో మంత్రి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉండటం గమనార్హం.
ఈ భేటీలో సీఎం కేసీఆర్ ఉద్యోగులకు సానుకూలంగా స్పందించారు. రెండో పీఆర్సీ ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. అంతేకాదు, ఈ ఏడాది జులై నుంచే మధ్యంతర భృతి (ఐఆర్) అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
తాము ఇచ్చే చందాతో ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఓ ట్రస్టును ఏర్పాటు చేయాలని, అన్ని సౌకర్యాలతో ఈహెచ్ఎస్‌ను తీర్చిదిద్దాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు సీఎం కేసీఆర్‌ను కోరారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సీపీఎస్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టు వారు మీటింగ్ అనంతరం, మీడియాకు వెల్లడించారు.
Also Read: రికార్డు స్థాయి ధర పలుకుతున్న కోకాపేట భూములు.. అత్యధికం ఎకరం రూ. 72 కోట్లు.. కొనసాగుతున్న ప్రక్రియ..
శుక్ర లేదా శనివారాల్లో పీఆర్సీ, ఐఆర్ గురించి అసెంబ్లీలోనే ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టు జేఏసీ చైర్మన్ రాజేందర్ వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్‌కు ఉద్యోగులమంతా అండగా ఉంటామని జేఏసీ నేతలు చెప్పారు. మొన్ననే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. తద్వాారా ఆర్టీసీ కార్మికుల్లోని వ్యతిరేకతను తొలగించే ప్రయత్నం చేసినట్టయింది.