బీజేపీలోకి చీకోటి ప్రవీణ్.. బండి సంజ‌య్ స‌హా ప‌లువురు నేత‌ల‌తో భేటీ !

By Mahesh Rajamoni  |  First Published Aug 3, 2023, 8:03 PM IST

Hyderabad: క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ బీజేపీలో చేరే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ముందు చీకోటి ప్రవీణ్ పార్టీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. బండి సంజ‌య్ స‌హా ప‌లువురు బీజేపీ సీనియ‌ర్ నేత‌ల‌ను చీకోటి ప్ర‌వీణ్ క‌ల‌వ‌డం కూడా ఆయ‌న చేరిక ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి. 
 


Chikoti Praveen likely to join BJP: మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేయడంతో వార్తల్లో నిలిచిన క్యాసినో ఆర్గనైజర్ చీకోటి ప్రవీణ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందిన బండి సంజయ్ సహా పలువురు బీజేపీ జాతీయ నేతలకు ప్రవీణ్ శుభాకాంక్షలు తెలుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత నెలలో గజ్వేల్ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తత నెలకొనడంతో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ర్యాలీ చేపట్టినందుకు ప్రవీణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరాఠా పాలకుడు శివాజీ విగ్రహాన్ని ఒక వ్యక్తి అపవిత్రం చేశాడని ఆరోపిస్తూ ఆయనకు నివాళులర్పించేందుకు ఆయన ర్యాలీ చేపట్టారు.

కాగా, థాయ్ లాండ్ లో ఓ క్యాసినోపై జరిపిన దాడుల్లో ప్రవీణ్ తో పాటు పలువురిని పట్టుకున్నారు. అనంతరం అతడిని భారత్ కు తరలించారు. తాను ఆహ్వానం మేరకు హోటల్ కు వెళ్లాననీ, అక్కడ జూదం గురించి తనకు తెలియదని ప్రవీణ్ స్పష్టం చేశాడు. అలాగే, బోనాల సందర్భంగా అక్రమంగా సెక్యూరిటీ గార్డులను నియమించుకుని ఆయుధాలు సమకూర్చినందుకు హైదరాబాద్ లోని ఛత్రినాక పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కొన్నాళ్లకు ఈ కేసులో ఆయన కోర్టు నుంచి బెయిల్ పొందారు.

Latest Videos

ఇటీవల లాల్ దర్వాజా బోనాలులో మీడియాతో మాట్లాడుతూ పోలీసులు తన సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకున్నప్పుడు హిందుత్వకు మద్దతిస్తున్నందుకు, హిందువుల కోసం గళమెత్తినందుకు తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. చీకోటి ప్రవీణ్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన, జాతీయ పార్టీ నేతలతో భేటీ కావడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని తెలంగాణ భారతీయ జనతా పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీలో చేరుతున్నారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. ఇది సాధారణ పర్యటన కూడా కావచ్చున‌ని బీజేపీ రాష్ట్ర పార్టీ నేత ఒకరు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ముందు ప్రవీణ్ పార్టీలో చేరే సూచనలు ఉన్నాయని మరో నేత చెప్పారు. చాలా కాలంగా సైదాబాద్ లోని ప్రవీణ్ ఇంటికి వివిధ రాజకీయ పార్టీల నేతలు వస్తుండ‌టం గ‌మ‌నార్హం.

click me!