మోత్కుపల్లికి చివరి నిమిషంలో పవన్ కల్యాణ్ షాక్: ఎందుకు?

By pratap reddyFirst Published Aug 11, 2018, 2:41 PM IST
Highlights

మోత్కుపల్లి జనసేన పార్టీలో చేరుతారని, ఆయన తెలంగాణ పార్టీ బాధ్యతలను పవన్ కల్యాణ్ అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అయితే, అదేం జరగకపోగా అసలు పవన్ కల్యాణ్ తో భేటీయే రద్దయింది. 

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చివరి నిమిషంలో షాక్ ఇచ్చారు. తాను పవన్ కల్యాణ్ ను కలుస్తున్నట్లు మోత్కుపల్లి స్వయంగా చెప్పారు. అయితే, చివరి నిమిషంలో మోత్కుపల్లితో భేటీ పవన్ కల్యాణ్ రద్దు చేసుకున్నారు. 

మోత్కుపల్లి జనసేన పార్టీలో చేరుతారని, ఆయన తెలంగాణ పార్టీ బాధ్యతలను పవన్ కల్యాణ్ అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అయితే, అదేం జరగకపోగా అసలు పవన్ కల్యాణ్ తో భేటీయే రద్దయింది. కొద్ది కాలం క్రితం జరిగిన ఈ పరిణామం వెనక ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన పవన్ కల్యాణ్ తెలంగాణ విషయంలో కూడా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో కూడా తమ పార్టీ పోటీ చేస్తుందని చెబుతున్నప్పటికీ ఆయన పార్టీని బలోపేతం చేయడానికి ఏ విధమైన చర్యలు కూడా తీసుకోవడం లేదు.

పార్టీలో చేరుతామని వస్తున్నవారిని కూడా ఆపేస్తున్నట్లు చెబుతున్నారు. బహిష్కరణకు గురైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మోత్కుపల్లి లక్ష్యం చేసుకుని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై కూడా అదే తీవ్రతతో విమర్శలు గుప్పించారు. 

ఆ రకంగా చూస్తే, మోత్కుపల్లి వస్తే తెలంగాణలో జనసేనకు ఊపు వచ్చి ఉండేది. అయితే, పవన్ కల్యాణ్ ఆలోచన మరో రకంగా ఉందని చెబుతున్నారు. ఆయన కేసీఆర్ పట్ల సానుకూలంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతుల కోసం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలతో సంతృప్తి చెందినట్లు చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో అవసరమైతే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)తో కలిసి పనిచేయాలనే ఆలోచన కూడా పవన్ కల్యాణ్ చేయవచ్చునని అంటున్నారు. అందువల్లనే మోత్కుపల్లితో భేటీని ఆయన రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు. 

click me!