
తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ హాట్ టాపిక్ అయింది. ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ టిడిపి నాయకులు లేని పార్టీగా మారుతున్న వాతావరణం ఉంది. పార్టీ తరుపున గెలిచిన వారంతా బంగారు తెలంగాణ కోసం కారెక్కేశారు. ఇక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలిర్రు. అందులో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఆర్. కృష్ణయ్య మాత్రమే ఉన్నారు. అయితే రానున్న ఎన్నికల నాటికి టిడిపి పొత్తల పేరుతో చిత్తయ్యే ప్రమాదం నెలకొందని పార్టీ కేడర్ లో ఆందోళన మొదలైంది.
తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని 2019 ఎన్నికలు కొట్లాడాలని తెలంగాణ సిఎం కేసిఆర్ స్కెచ్ వేసినట్లు రాజకీయాల్లో చర్చ సాగుతున్నది. ఆ దిశగా కేసిఆర్ అడుగులు వేస్తున్నారు. కానీ టిడిపిలో ఇంకా ఆ వాతావరణం లేదు. మూడేళ్లపాటు టిఆర్ఎస్ మీద టిడిపి గట్టిగానే పోరాటం చేసింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అధికార టిఆర్ఎస్ పార్టీని కౌగిలించుకోవడం అంత సులభం కాదుగదా అని టిడిపికి సంబంధించిన వరంగల్ లీడర్ ఒకరు వెల్లడించారు. మరి పొత్తు అనివార్యమైతే టిడిపి చీలిపోవడం ఖాయమన్న ప్రచారం కూడా జోరందుకుంది. కేసిఆర్ పొడ గిట్టని నాయకులంతా పొత్తు కుదిరితే పక్కకు పోవుడు ఖాయమని పార్టీ నేతల నుంచి వస్తున్న వాదన.
తెలంగాణ ప్రభుత్వంపై ఘాటుగా స్పందిస్తూ ధీటైన పోరాటం చేయడంలో రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. ఈ మూడేళ్ల కాలంలో ఆయన కేసిఆర్ సర్కారును అనేక సందర్భాల్లో ఇరకాటంలోకి నెట్టేశారు. అయితే ఒక దశలో రేవంత్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నోట్ల పంపిణీ విషయంలో కేసిఆర్ వలకు చిక్కారు. అయినప్పటికీ అంతకంటే ముందు కానీ, ఆ కేసు తర్వాత కానీ రేవంత్ ఏనాడూ ఈసమంత తగ్గిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో టిడిపి, టిఆర్ఎస్ పొత్తు అంటూ జరిగితే మొదటి వికెట్ రేవంత్ రెడ్డిదే అన్న ప్రచారం ఇప్పటికే పార్టీలో షురూ అయింది. అయితే పార్టీ అధినేత చంద్రబాబు కూడా పొత్తులు ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంలేదు. ఎన్నికల వేళ పొత్తులపై పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందన్న సంకేతాలిచ్చారు. ఈ సంకేతాలతో తాము నిశ్చింతగా ఉండలేమని రేవంత్ రెడ్డి వర్గం అంటున్నది. అయితే ఇప్పుడు అందరిలో ఒకటే టాక్ రేవంత్ వర్గంలో ఉన్నది ఎవలెవలు? అని హాట్ హాట్ గా చర్చలు సాగుతున్నాయి.
కేసిఆర్ తో తనకు జాతి వైరమే ఉందంన్న రీతిలో రేవంత్ స్పందిస్తున్నారు. 2019లో ఆరు నూరైనా కేసిఆర్ ను గద్దె దింపడే తన లక్ష్యమని ప్రకటించారు రేవంత్. దానికోసమే అవసరమైతే కాంగ్రెస్ తో పొత్తుకు సై అన్నారు. కానీ పార్టీ నేతలు కొందరు దానికి అడ్డుకట్ట వేశారు. టిఆర్ఎస్ తో అయినా పొత్తకు పోతామంటూ మోత్కుపల్లి ఇంకో బాంబు పేల్చారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాబట్టి కాంగ్రెస్ తో కలిసే ప్రసక్తే లేదన్నారు.
ఈ నేపథ్యంలో టిడిపి అధిష్టానం రకరకాల కోణాలనుంచి ఆలోచిస్తోంది. అయితే పొత్తుల దిశగానే ఆ పార్టీ ముందుడుగు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రేవంత్ తోపాటు ఎవరెవరు పార్టీని వీడతారన్నదానిపై చర్చలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు కేసిఆర్ పై ఘాటైన విమర్శల వర్షం కురిపించిన నాయకులంతా టిడిపిని వీడే అవకాశాలున్నట్లు కేడర్ అంటున్నారు. ఆ జాబితాలో రేవంత్ రెడ్డితోపాటు ములుగు సీతక్క, ఉమా మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పెద్దపల్లి విజయరమణారావు, గజ్వెల్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, నల్లగొండ భూపాల్ రెడ్డి, సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డి, రాజారాం యాదవ్, నన్నూరి నర్సిరెడ్డి ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరితోపాటు మరికొంత మంది జూనియర్లు సైతం పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఇప్పటివరకు వీరంతా కేసిఆర్ పై కరుకుగా విమర్శలు గుప్పించిన పరిస్థితి ఉంది. అయితే మిగతా సీనియర్లు పార్టీలోనే ఉండొచ్చని అంటున్నారు. కేసిఆర్ పొడ గిట్టని నాయకులు, కార్యకర్తలు వెళ్లిపోతారు. పార్టీకోసం ప్రాణాలిచ్చే వారంతా ఉంటారు అని టిడిపికి సంబంధించిన నాయకుడొకరు చెప్పారు. మొత్తానికి పొత్తులు వ్యవహారం తెలంగాణ టిడిపిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాతావరణం మాత్రం ఉంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి