తెలంగాణ నిరుద్యోగులకు తీపి కబురు

First Published Oct 13, 2017, 4:20 PM IST
Highlights
  • రాష్ట్రపతి నిబంధనల మార్పుపై ఉన్నత స్థాయి కమిటీ భేటీ
  • ఉప ముఖ్యమంత్రి కడియం అధ్యక్షతన కమిటీ సమావేశం
  • హాజరైన మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీష్ రావు, సిఎస్ ఎస్పీసింగ్
  • జోనల్ వ్యవస్థ, ఉద్యోగుల కేడర్ పై ప్రాథమికంగా చర్చించిన కమిటీ
  • ఈ నెల 21వ తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయం
  • ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం తీసుకుంటామన్న ఉప ముఖ్యమంత్రి

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలో తీపి కబురు అందించేందుకు కసరత్తు చేస్తోంది. త్వరలో డిఎస్సీ వేసేందుకు కార్యాచరణ మొదలు పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం 31 జిల్లాలను ఏర్సాటు చేసుకున్న నేపథ్యంలో కొత్త జోనల్ విధానం, స్థానికతను నిర్వచించడం, రాష్ట్రపతి నిబంధనల సవరణ లేదా నూతనంగా రాష్ట్రపతి నిబంధనల రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశం ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన నేడు సచివాలయంలో సమావేశమైంది.

వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, విద్యాశాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె జోషి, పశు సంవర్థక శాఖ, డైరీ డెవలప్ మెంట్ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బి.ఆర్.మీనా, న్యాయశాఖ కార్యదర్శి వి. నిరంజన్ రావు, విద్యుత్ శాఖ  ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్ర, సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా హాజరై రాష్ట్రపతి నిబంధనల మార్పులపై చర్చించారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ సూచించినట్లు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయా జిల్లాల్లోని స్థానికులకు ఇబ్బందులు జరగకుండా రాష్ట్ర, మల్టీ జోనల్, జోనల్, జిల్లా స్థాయి పోస్టుల విభజన ఎలా జరగాలి, జిల్లా క్యాడర్ ఎలా ఉండాలి అనే దానిపై అధికారులతో ప్రాథమిక సమాచారం తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించి వారి అభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు. ముఖ్యమైన ఈ అంశంపై మరిన్నిసమావేశాలు జరిగిన తర్వాతే నిర్ణయానికి వస్తామన్నారు.

ఈనెల 21వ తేదీన మరోసారి సమావేశమవుతున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా రాష్ట్రపతి నిబంధనలకు సంబంధించిన ఈ ఉన్నత స్థాయి కమిటీ తన ప్రతిపాదనలు సిద్ధం చేసి సిఎం కేసిఆర్ కు అందజేస్తుందన్నారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/cJzb9d

 

click me!