జగదీష్ ఇలాకాలో తుమ్మలను తెగ మెచ్చుకున్న కేసిఆర్

First Published Oct 12, 2017, 8:50 PM IST
Highlights
  • సూర్యాపేట సభలో తుమ్మలపై ప్రశంసల వర్షం
  • ఖమ్మం జిల్లాకు తుమ్మల అపర బగీరథుడు
  • 10 నెలల్లోనే సీతారామా ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లిచ్చిండు
  •  

అది నల్లగొండ నుంచి విడివడిన కొత్త జిల్లా సూర్యాపేట. ఆ జిల్లాలో పండగ జరుగుతున్నది. ఆ పండగ ఏమంటే కొత్త జిల్లాకు కొత్త కలెక్టరేట్ భవనానికి శంకుస్థాపన కార్యక్రమం. శంకుస్థాపన జరిగింది. తర్వాత సభ మొదలైంది. ఈ సభలో సిఎం కేసిఆర్ ప్రసంగం మొదలైంది. అప్పటి నుంచి మొదలుకొని ప్రసంగం అయిపోయే వరకు మధ్యలో స్థానిక మంత్రి జగదీష్ రెడ్డి కంటే ఎక్కువగా పక్క జిల్లా అయిన ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మెచ్చుకున్నారు కేసిఆర్.

సభలో మాట్లాడినంతసేపు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి కంటే ఎక్కువగా ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును చాలాసార్లు మెచ్చుకున్నారు సిఎం కేసిఆర్. సూర్యాపేట జిల్లాలో ప్రతి ఇంటికి 6 మొక్కలు పెంచాలె. పెంచుతరా సల్లబడ్డరా అని సభికులను ప్రశ్నించారు సిఎం. రెండేండ్ల తర్వాత నేను తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడి నుంచి పోతుంటే సూర్యాపేటలో మొత్తం అడివి కనబడాలె. ఇండ్లు ఉన్నయా లేవా అన్నట్లు అనుమానం రావాలె అని చమత్కరించారు కేసిఆర్.

ఇంకోసారి ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టుపట్టి పది నెలల్లోనే సీతారామా ప్రాజెక్టు పూర్తి చేసి 11 వ నెలలో నీళ్లిచ్చిండని పొగిడారు. ఖమ్మం జిల్లాకు నేను కాదు బగీరథుడు  తుమ్మల నాగేశ్వరరావే ఖమ్మం జిల్లాకు అపర బగీరథుడు అని ప్రశంసించారు. అలాగే తుమ్మలను మొన్ననే ఖమ్మం జిల్లా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు అని కూడా కామెంట్లు చేశారు. మొత్తానికి సూర్యాపేట సభలో స్థానిక మంత్రి కంటే ఎక్కువగా తుమ్మలను మెచ్చుకోవడం టిఆర్ఎస్ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ  హాట్ టాపిక్ అయింది.

 

పాత నల్లగొండ జిల్లాకు రెండు వరాలిచ్చిన కేసిఆర్

తెలంగాణ సిఎం కేసిఆర్ పాత నల్లగొండ జిల్లా (నల్లగొండ, సూర్యాపేట) కీలకమైన రెండు వరాలు ప్రకటించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్త కలెక్టరేట్ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిఎం మాట్లాడారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలపై ఎనలేని ప్రేమను కురిపించారు కేసిఆర్.

వచ్చే ఏడాది బడ్జెట్ లో పాత నల్లగొండ జిల్లాకు రెండు మెడికల్ కళాశాలలను మంజూరు చేసే బాధ్యత నాదే అని సభలో ప్రకటించారు కేసిఆర్. అందులో ఒకటి నల్లగొండ జిల్లాకు, ఇంకోటి సూర్యాపేట జిల్లాకు మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తానని హామీ ఇస్తున్న అని సిఎం కేసిఆర్ ప్రకటించారు.

సూర్యాపేట పట్టణంలో బంజారా భవన్ కావాలని మంత్రి జగదీష్ రెడ్డి సభలోనే సిఎంను అడిగారు. దీంతో స్పందించిన సిఎం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బంజారా భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతికి 15 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వాటికి రేపే జిఓ ఇస్తామని ప్రకటించారు. తండాలకు కూడా నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలను సైతం విమర్శించారు కేసిఆర్. ఉత్తం కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/dKBKp6

 

click me!