Bharat Bandh: నరేంద్ర మోడీ మాయలో సీఎం కేసీఆర్.. రేవంత్ రెడ్డి విమర్శలు

By telugu teamFirst Published Sep 27, 2021, 3:18 PM IST
Highlights

తొలుత రైతు ఉద్యమానికి మద్దతునిచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు దాని ఊసే పట్టించుకోవడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోడీ ఏం మాయ చేశారో గానీ, సీఎం కేసీఆర్ పూర్తిగా మారిపోయారని అన్నారు. ప్రజలు భారత్ బంద్ పాటిస్తుంటే మోడీతో కేసీఆర్ విందు చేసుకుంటున్నారని ఆరోపించారు. గత భారత్ బంద్ నిరసనల్లో కేటీఆర్ కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు.

హైదరాబాద్: ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల(Farmers) పిలుపు మేరకు ఈ రోజు పాటిస్తున్న భారత్ బంద్‌(Bharat Bandh)లో సీఎం కేసీఆర్(CM KCR) పాల్గొనకపోవడాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఖండించారు. సీఎం కేసీఆర్ భారత్ బంద్‌లో పాల్గొనకుండా ప్రధానమంత్రి మోడీ(PM Modi)తో విందు చేసుకుంటున్నారని విమర్శించారు. భారత్ బంద్‌లో భాగంగా ఉప్పల్ డిపోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.

ప్రధానమంత్రి మోడీ ఏం మాయ చేశారో గానీ.. సీఎం కేసీఆర్ పూర్తిగా మారిపోయారని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ తొలుత రైతుల ఉద్యమానికి మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. కేటీఆర్ కూడా గతంలో రైతులు ఇచ్చిన బంద్‌లో పాల్గొన్నారని చెప్పారు. కానీ, ఇప్పుడు మోడీ ఏం మాయ చేశారో గానీ, సీఎం మారిపోయారని చెప్పారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ పాలనలో పేదల బతుకు దుర్భరంగా మారాయని అన్నారు. ఇవాళ్టి బంద్‌లో సీఎం కేసీఆర్ పాల్గొనలేదని, మోడీతో విందు చేసుకుంటున్నారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం పనిచేసిందని అన్నారు. కానీ, ఇప్పుడు మోడీ ప్రభుత్వం మాత్రం అన్నదాతలను బానిసలుగా మారుస్తున్నదని చెప్పారు.

కమ్యూనిస్ట్ పార్టీ నేతలతో కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి నూతన సాగు చట్టాలు మరణ శాసనాలని అన్నారు. వాటితో రైతుల భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని ఆగ్రహించారు. సాగును బడా కార్పొరేట్లు అదానీ, అంబానీలకు మోడీ తాకట్టు పెట్టారని ఆరోపించారు.

click me!