Telangana Rains: తెలంగాణలో వర్షాలు పడటానికి వాతావరణం అనుకూలంగా మారుతోందని భారత వాతావరణశాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ-గద్వాల్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముంది.
Hyderabad: ఈ నెల మొదటివారంలో తెలంగాణలో సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నివేదికలు పేర్కొంటున్నాయి. నవంబర్ మొదటి వారంలో తెలంగాణ రాష్ట్రం వర్షాన్ని చవిచూస్తుందనీ, బంగాళాఖాతం నుండి దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, అలాగే బంగాళాఖాతంపై ద్రోణి వరకు బలమైన తూర్పు/ఈశాన్య గాలుల ప్రభావంతో రాబోయే ఏడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
తాజా తూర్పు గాలుల ప్రభావంతో రానున్న ఆరు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ-గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వీటితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. అయితే, కనిష్ట ఉష్ణోగ్రతలు 17-20ºC పరిధిలో ఉండవచ్చునని తెలిపింది. ఇదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 32-34 ºC మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.
అలాగే, తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే 48 గంటల్లో, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పొగమంచు, అధిక తేమతో కూడిన గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ నెల 2 నుంచి 9 వరకు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం తెలిపింది. గురువారం ఆదిలాబాద్ లో అత్యధిక కనిష్ఠ ఉష్ణోగ్రత 16.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.