KCR: ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలేనని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అందుకే ఎన్నికలు వచ్చినప్పుడు అభ్యర్థిని మాత్రమే కాకుండా అతడి వెనక ఉన్న పార్టీ గుణగణాలు, చరిత్ర చూసి బాగా ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు.
Telangana Assembly Elections 2023: వచ్చే నెలలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముచ్చటగా మూడో సారి అధికారం పీఠం దక్కించుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఓటర్లను తమవైపునకు తప్పుకోవడానికి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. సీఎం కేసీఆర్ వరుస మీటింగులతో ముందుకు సాగుతూ బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అభివృద్ది జరిగిన క్రమాన్ని వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. "తెలంగాణ ప్రగతి కోసం అన్ని చర్యలు తీసుకున్నామనీ, రాష్ట్రంలో మెరుగైన పాలన అందించామని అన్నారు. తెలంగాణ రాకపోతే నిర్మల్ జిల్లా అయ్యేదా..? అని ప్రశ్నించిన కేసీఆర్.. నిర్మల్ జిల్లాను చేయించింది అల్లోల ఇంద్రకరణ్ రెడ్డినే.. ప్రజల కోసం తండ్లాడే వ్యక్తి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని" ప్రజలను కోరారు.
రైతు బంధు అనేది వట్టిగనే ఆషామాషీగా ఇచ్చేది కాదనీ, ఎన్నికల కోసం ఓట్ల కోసం ఇచ్చేది కాదని పేర్కొన్న సీఎం కేసీఆర్.. రైతు బంధు స్కీమ్ పెట్టమని తనన ఎవరూ అడగలేదనీ, ఎవరూ దాని కోసం ధర్నాటు చేయలేదనీ, తామంతట తామే ఆలోచించి, రైతు శ్రేయస్సు కోసం ఆ స్కీమ్ తీసుకువచ్చినట్టు స్పష్టం చేశారు. అలాగే, "ఇవ్వాల నీరు ప్రజెక్టుల నుంచి ఫ్రీగా సరఫరా అవుతోంది. నీళ్లు ఉచితమే.. కరెంట్ ఉచితమే.. రైతు బంధు పెట్టుబడిగా ఇస్తున్నాము..రైతులు పండించిన పంట మొత్తం కోంటావున్నాము" అని కేసీఆర్ అన్నారు. దీని వల్ల రైతుల ముఖాలు కలకలలాడుతున్నాయనీ, అప్పులన్ని కట్టుకుంటున్నారని తెలిపారు. రెండు సార్లు రైతుల రుణమాఫీ కూడా చేశామనీ, దీని కోసం 37 వేల కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఇంకా కొద్ది మందికి రైతు రుణమాఫీ కావాల్సి ఉందనీ, ఎలక్షన్ కోడ్ కారణంగా ఆలస్యమవుతున్నదని తెలిపారు.
రైతు రుణమాజీ సహా పలు పథకాల డబ్బులు అందకుండా కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందన్నారు. అయితే, ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటే ఈ వారంలోనే అందిస్తామన్నారు. అలా కుదరని పక్షంలో ఎన్నికలు ముగిసిన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ అందని వారికి కోసం చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదనీ, దానిని ఆలోచించి ఉపయోగించుకోవాలని అన్నారు. గతంలో మంచి చేసిన పార్టీని ఎన్నికలు రాగానే మర్చిపోవద్దనీ, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీని గెలిపిస్తే అందరికీ మేలు జరుగుతుందన్నారు. బీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల కోసమే పుట్టిందనీ, ప్రజల హక్కులను కాపాడేందుకు తెలంగాణకు బీఆర్‌ఎస్ కాపలాదారుగా ఉందన్నారు. చావు నోటిలో తల పెట్టి తెలంగాణ సాధించుకున్నామని పేర్కొన్న కేసీఆర్.. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలేననీ, రాజకీయ పార్టీలు కాదని అన్నారు. అందుకే ఎన్నికలు వచ్చినప్పుడు అభ్యర్థిని మాత్రమే కాకుండా అతడి వెనక ఉన్న పార్టీ గుణగణాలు, చరిత్ర చూసి బాగా ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు.