వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే: తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్

By narsimha lode  |  First Published Aug 6, 2023, 4:58 PM IST

గతంలో  కంటే ఎక్కువ సీట్లతో  తెలంగాణలో మూడోసారి  అధికారాన్ని దక్కించుకుంటామని  సీఎం  కేసీఆర్ విశ్వాసం వ్యక్తం  చేశారు.  తెలంగాణ అసెంబ్లీలో  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతిపై ఆయన ప్రసంగించారు.
 


హైదరాబాద్:వచ్చే ఎన్నికల్లో  గతంలో కంటే  ఏడేనిమిది సీట్లతో  మరోసారి తెలంగాణలో అధికారంలోకి వస్తామని  తెలంగాణ సీఎం కేసీఆర్ ధీమాను వ్యక్తం  చేశారు.  తెలంగాణ అసెంబ్లీలో  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతిపై  స్వల్పకాలిక చర్చపై   ఆదివారంనాడు  తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు. రాష్ట్రంలో  కాంగ్రెస్ వస్తే రైతు బంధు, దళిత బంధుకు రాంరాం పలకనున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీ హయంలో రైతుల మెడపై కత్తిపెట్టి నీటి తీరువా వసూలు చేశారని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణలో రైతులకు  24 గంటల పాటు ఉచిత  విద్యుత్ సరఫరా చేస్తుంటే  ఇష్టారీతిలో మాట్లాడుతున్నారన్నారు. ఉచిత విద్యుత్ పై  కాంగ్రెస్ నేతల మాటలను  ప్రజలు అర్ధం  చేసుకుంటున్నారన్నారు. నల్గొండ జిల్లాలో దామరచర్ల వద్ద యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంపై  కాంగ్రెస్ ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలను  ఆయన ప్రస్తావించారు.  అభివృద్దికి నిరోధకులుగా  వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలను ఎలా గెలిపిస్తారని  తాను  గత ఎన్నికల సమయంలో  ప్రజలను కోరినట్టుగా చెప్పారు. తన వినతితో ప్రజలు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఓడించారని  కేసీఆర్ గుర్తు చేశారు. ఇంకా కూడ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  అలానే మాట్లాడుతున్నారన్నారు. 

Latest Videos

కాళేశ్వరం నిర్మించకుంటే  వేల ఎకరాలకు  నీరు ఎక్కడి నుండి వస్తుందని ఆయన  ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లాలోని  నాలుగు జలధారలు కాళేశ్వరం  వల్లే పారుతున్నాయన్నారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు నీరు రాకపోతే  కాళేశ్వరం నుండి నీటిని తీసుకొనేలా ప్రణాళికలు రచించామన్నారు.కాళేశ్వరం నుండే తుంగతుర్తి,  కోదాడ, డోర్నకల్ కు  సాగునీరు దక్కనుందన్నారు. 

also read:కాకినాడ తీర్మానం కాకెత్తుకుపోయింది: అసెంబ్లీలో బీజేపీపై కేసీఆర్ ఫైర్

పల్లెలు, పట్టణాల్లో  కూడ రూపాయికే నల్లా కనెక్షన్లు ఇస్తున్నట్టుగా కేసీఆర్ గుర్తు  చేశారు. ప్రతి ఇంటికి 20వేల మంచినీళ్లు ఇస్తున్నామన్నారు.ఇప్పుడు  తండాలు, గిరిజన ఆవాసాల్లో రోగాలు కన్పిస్తున్నాయా అని ఆయన  ప్రశ్నించారు.ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల నుండి ప్రతినిధులు వచ్చి  మిషన్ భగీరథను అధ్యయనం చేశారన్నారు.గ్రావిటీతోనే వేలాది గ్రామాల్లో  ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని  కేసీఆర్  వివరించారు. దేశంలోని వీధి నల్లాలు లేని  ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన చెప్పారు. పారిశుద్యం, మంచినీటి విషయంలో కేంద్రం  అనేక అవార్డులు ఇచ్చిందన్నారు.తెలంగాణకు  ఒక్క రూపాయి ఇవ్వని కేంద్రం రాష్ట్రం చేసిన పనులకు అవార్ఢులు ఇచ్చిందని సీఎం తెలిపారు.కాంగ్రెస్ పాలనలో  రాష్ట్రంలో  35 వేల చెరువులు అదృశ్యమయ్యాయన్నారు. 
 

click me!