
హైదరాబాద్: ప్రజా యుద్దనౌకగా పేరుగాంచిన గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్‌రావు కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. అయితే గద్దర్ తన జీవితంలోని 25 ఏళ్లకు పైగా ప్రాణాంకమైన బుల్లెట్‌ను శరీరంలో ఉంచుకునే జీవించారు. బుల్లెట్‌ను బయటకు తీయడం వల్ల కలిగే వైద్యపరమైన చిక్కుల వల్ల వ్యక్తికి మరింత ప్రమాదకరం కావడంతో.. వెన్నెముక సమీపంలో స్థిరపడిపోయిన బుల్లెట్‌తోనే జీవించాల్సి వచ్చింది. అసలు గద్దర్ శరీరంలోకి ఆ బుల్లెట్ ఎలా వచ్చింది?.. 1997లో గద్దర్‌పై జరిపిన కాల్పులకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..
1997లో అల్వాల్‌లోని ఆయన నివాసంలో గద్దర్ అలియాస్ గుమ్మడి విట్టల్ రావుపై ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన శరీరంలోకి ఐదు బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. దీంతో ఆయనకు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతని శరీరం నుండి నాలుగు బుల్లెట్లు బయటకు తీశారు. ఆ తర్వాత నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని సర్జన్లు అతని వెనెన్నముక్క వద్ద ఉన్న ఐదవ బుల్లెట్‌ను బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ చివరికి వైద్యపరమైన సమస్యల భయంతో ఆ బుల్లెట్ తీయకూడదని నిర్ణయించుకున్నారు.
Also Read: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత..
అప్పటి నుండి బుల్లెట్ ఆయన శరీరంలో మిగిలిపోయింది. అయితే ఇది మొదట్లో తనను ఇబ్బంది పెట్టలేదని.. కానీ వయసు పైబడుతున్న కొద్ది నొప్పి తీవ్రమైందని.. చికిత్స కోసం నేను క్రమం తప్పకుండా నిమ్స్‌కు వెళ్లాల్సి వస్తుందని కొన్నేళ్ల కిందట గద్దర్ ఓ సందర్భంలో చెప్పారు.
ఇక, ‘‘నాపై హత్యాయత్నంకు సంబంధించి విచారణకు అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే దాదాపు పదేళ్లపాటు ఈ సమస్యను చల్లార్చిన తర్వాత.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలీసులు కేసును మూసివేశారు. సరైన కారణం చెప్పలేదు’’ ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గద్దర్ చెప్పారు.
అయితే గద్దర్ మద్దతుదారుల నుంచి హక్కుల కార్యకర్తలతో పాటు చాలా మంది వ్యక్తులు ఆయనపై దాడి చేసిన వారికి పోలీసుల మద్దతు ఉందని నమ్ముతారు. అయితే గద్దర్‌ను మావోయిస్టుల దుశ్చర్యల బాధితులు కాల్చిచంపారని అధికారులు పేర్కొంటారు. అయితే అప్పటి నుంచి 25 ఏళ్లకు పైగా శరీరంలో బుల్లెట్‌తోనే ఆయన జీవనం సాగించారు.