పార్టీ ఇచ్చిన ఏ బాధ్యతనైనా తాను క్రమశిక్షణ గల సైనికుడిగా నిర్వహిస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: పార్టీ ఏది ఆదేశిస్తే దాన్ని పాటించే క్రమశిక్షణ గల కార్యకర్తగా తాను పనిచేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ముందుకు వెళ్తామని కిషన్ రెడ్డి చెప్పారు.
బుధవారంనాడు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను నిన్న హైద్రాబాద్ లో ఉన్న సమయంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టుగా జేపీ నడ్డా తనకు ఫోన్ చేశారని కిషన్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు దఫాలు, తెలంగాణకు తొలి సారిగా బీజేపీ అధ్యక్షుడిగా తాను పని చేసినట్టుగా కిషన్ రెడ్డి గుర్తు చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా తనను నియమించినందుకు ఎలాంటి అసంతృప్తి లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ్టి వరకు తాను పార్టీని ఏది అడగలేదన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వహించినట్టుగా కిషన్ రెడ్డి చెప్పారు. పార్టీ సిద్దాంతం కోసం తాను పని చేస్తున్నానని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రమంత్రివర్గంలోకి తనను మోడీ తీసుకున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.
also read:అసంతృప్తి లేదు, అప్పటివరకు మంత్రినే: మీడియా చిట్ చాట్ లో కిషన్ రెడ్డి
జాతీయ, రాష్ట్ర నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని కిషన్ రెడ్డి చెప్పారు. ఇవాళ సాయంత్రం హైద్రాబాద్ కు చేరుకుంటానని కిషన్ రెడ్డి తెలిపారు. రాత్రికే పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశమౌతానని కిషన్ రెడ్డి చెప్పారు.
ఈ నెల 8వ తేదీన వరంగల్ కు మోడీ వస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సభకు ఏర్పాట్లు చేసేందుకు రేపు వరంగల్ కు వెళ్తున్నట్టుగా కిషన్ రెడ్డి వివరించారు. వరంగల్ లో రైల్వే వ్యాగన్లు తయారు చేసే యూనిట్ కు ప్రధాని శంకుస్థాపన చేస్తారని కిషన్ రెడ్డి చెప్పారు.ఈ నెల 9న దక్షిణాది రాష్ట్రాల బీజేపీ నేతల సమావేశం హైద్రాబాద్ లో ఉంటుందని కిషన్ రెడ్డి వివరించారు.