వచ్చే ఎన్నికల్లో 95 కి పైగా అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుండి 105 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. సోమవారంనాడు 115 మందితో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో విడుదల చేశారు. మంచి ముహుర్తం ఉన్నందున ఇవాళ అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్టుగా సీఎం కేసీఆర్ తెలిపారు.తెలంగాణను ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో పోట్లాడడం ఇతర పార్టీలకు పొలిటికల్ గేమ్ అని కేసీఆర్ చెప్పారు. తమకు ఎన్నికలంటే పవిత్ర కర్తవ్యంగా భావిస్తామన్నారు.
also read:ఏడు స్థానాల్లో మార్పులు : 115 మందితో బీఆర్ఎస్ జాబితా విడుదల చేసిన కేసీఆర్
భూపాలపల్లిలో ఈ దఫా మధుసూధనాచారి ఆశీర్వదించి వెంకటరమణారెడ్డికి మద్దతుగా నిలిచారని కేసీఆర్ చెప్పారు. తాండూరులో మహేందర్ రెడ్డి పోటీ చేయకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి అండగా నిలిచారన్నారు. అభ్యర్థుల జాబితాలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే సర్ధుబాటు చేసుకున్న విషయాన్ని కేసీఆర్ వివరించారు.తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం రూ. 1.20 లక్షల నుండి రూ. 3 లక్షలకు పెరిగిందన్నారు.అన్ని రాష్ట్రాలను తలదన్నేలా రీతిలో రాష్ట్రం ముందుకు సాగుతుందన్నారు.అవసరాన్ని బట్టి అభ్యర్థులను మార్చుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై త్రిసభ్య కమిటీ పరిష్కరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
50 ఏళ్లు అవకాశం ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ మరోసారి అవకాశం ఇవ్వాలని అడగడం అర్ధం లేదన్నారు. దేశంలోని అన్ని రంగాలకు 24 గంటల పాటు విద్యుత్ ను సరఫరా చేస్తున్న ప్రభుత్వం తమదన్నారు.ఎంపీ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.