
BRS MLC Kalvakuntla Kavitha: ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్ లు స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తాయని టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రూ.50 కోట్లతో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న నిజామాబాద్ ఐటీ హబ్ ద్వారా ప్రత్యక్షంగా 750 మంది యువతకు, పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, పార్టీ ఎన్నారై గ్లోబల్ కన్వీనర్ మహేష్ బిగాలలతో కలిసి కవిత శనివారం నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని ఐటీ హబ్ భవనాన్ని సందర్శించారు.
వివరాల్లోకెళ్తే.. నిజామాబాద్ జిల్లాలో ఐటీ హబ్ నిర్వహణకు అంతా సిద్ధంగా ఉందనీ, త్వరలోనే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ సదుపాయాన్ని ప్రారంభిస్తారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నిజామాబాద్ లో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ హబ్ తో ప్రత్యక్షంగా 750 మంది యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. నగరంలోని ఐటీ హబ్ నిర్మాణ పనులను బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కన్వీనర్ బిగాల మహేష్ గుప్తాతో కలిసి కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఐటీ హబ్ నిజామాబాద్ వెబ్ సైట్ ను ఆమె ప్రారంభించారు. ఐటీ హబ్ లో పరిశ్రమల అభివృద్ధికి ఇది నాంది లాంటిదని ఎమ్మెల్సీ కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.
జిల్లా యువతకు ఉపాధి కల్పించేందుకు నిజామాబాద్ కు పరిశ్రమలు వస్తాయన్నారు. నిజామాబాద్ యువతకు శుభవార్తను అందిస్తూ త్వరలోనే ఐటీ హబ్ ను ప్రారంభిస్తామన్నారు. యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఐటీ హబ్ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. త్వరలోనే ఐటీ హబ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ ఐటీ హబ్ లో ఇప్పటికే 200కు పైగా చిలుకు సీట్ల కాంట్రాక్టులు పూర్తయ్యాయన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన 3 వేల నుంచి 4 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడించారు. త్వరలోనే హబ్ ను మరింత విస్తరిస్తామని కవిత తెలిపారు. ఎమ్మెల్యే గణేష్, ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలు భవిష్యత్ ప్రణాళికతో నిర్మాణాలు చేపట్టడం అభినందనీయమన్నారు.
మానవ వనరుల సరఫరా కోసం డిగ్రీ కళాశాలలతో ఒప్పందాలు కుదుర్చుకుంటామని కవిత చెప్పారు. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో పారిశ్రామికీకరణకు ఐటీ హబ్ ప్రారంభోత్సవం నాంది అని అన్నారు. నిజామాబాద్ లో మరిన్ని పరిశ్రమలు వస్తాయని చెప్పారు. ఐటీ ఎగుమతుల్లో భారత్ లో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని తెలిపారు. జిల్లాలోని ఉన్నత విద్యా సంస్థలతో ఐటీ హబ్ సమన్వయం చేసుకుని విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ ఎస్ నాయకులు సహా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.