మెడికో ఆత్మహత్య కేసు : ప్రీతి డెడ్‌బాడీకి ట్రీట్‌మెంట్ చేశారు.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Mar 4, 2023, 9:02 PM IST

ప్రీతి మృతదేహానికి చికిత్స చేశారని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతి మరణానికి వేధింపులనే కారణమని ఆయన ఆరోపించారు. 


వరంగల్‌ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్యకు సంబంధించి బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతి మృతదేహానికి చికిత్స చేశారని ఈటల ఆరోపించారు. అసెంబ్లీలో ఒక్క దళిత మహిళా ఎమ్మెల్యే కూడా లేరని ఆయన దుయ్యబట్టారు. సీఎంవోలో ఒక్క దళిత అధికారి కూడా లేరని ఈటల ఎద్దేవా చేశారు. ఉన్నత విద్య చదువుతున్న విద్యార్ధుల్లో 1000 మంది మధ్యలోనే చదువు వదిలేసి వెళ్లిపోతున్నారని.. 500 మంది చనిపోతున్నారని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలను ఈటల రాజేందర్ ప్రస్తావించారు. ప్రీతి మరణానికి వేధింపులనే కారణమని ఆయన ఆరోపించారు. చైతన్యాన్ని చంపేస్తే ఉన్మాదం వస్తుందని.. మనం ప్రోగ్రెసివ్ మేనర్‌లో వున్నామా, రిగ్రసివ్ మేనర్‌లో వున్నామా అని రాజేందర్ ప్రశ్నించారు. రైతుల వద్ద నుంచి అసైన్డ్ భూములు తీసుకుంటే మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని రాజేందర్ సూచించారు. 

ఇదిలావుండగా.. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో అనస్థీషియ విభాగంలో పీజీ మొదటి సంవత్సరంలో చేరిన ప్రీతి.. సీనియర్ విద్యార్థి ఎంఏ సైఫ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈనెల 22న ఉదయం ఓ మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని మొదట కథనాలు వెలువడ్డాయి. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో స్పృహ లేని స్థితిలో పడి ఉన్న ఆమెని ఎంజీఎం ఆసుపత్రిలోనే మొదట అత్యవసర చికిత్స అందించారు.

Latest Videos

ALso Read : మెడికో ప్రీతిది హత్యే: విచారణ తీరుపై సోదరుడు వంశీ అనుమానాలు

అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి  విషమిస్తుండడంతో..  అదే రోజు హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రికి అక్కడి నుంచి తరలించారు.  అప్పటినుంచి నిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స జరిగింది. కానీ ప్రీతి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు. ఆమెను కాపాడేందుకు ఐదుగురు వైద్యుల ప్రత్యేక బృందం విశ్వప్రయత్నాలు చేసింది. ఇంజక్షన్ ప్రభావం వల్ల ఆమె శరీరం లోపలి అవయవాలు అన్ని దెబ్బతిన్నాయని.. దీనివల్ల చికిత్సకు శరీరం ఏమాత్రం స్పందించలేకపోతుందని తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రీతి ప్రాణాలు కోల్పోయింది.  

ఇకపోతే.. ప్రీతి ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా నిందితుడు సైఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు చేసిన విజ్ఞప్తికి వరంగల్ కోర్ట్ సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నాలుగు రోజుల పాటు సైఫ్‌ను కస్టడీకి అనుమతించింది కోర్ట్. దీంతో గురువారం అతనిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. 

అటు ప్రీతిది  హత్యేనని  సోదరుడు వంశీ ఆరోపిస్తున్నారు. తన సోదరి ఆత్మహత్య  చేసుకొనేంత  పిరికిది కాదని ..  మెడికో  సైఫ్  రిమాండ్  రిపోర్టులో  కూడా తప్పులున్నాయని  ఆయన ఆరోపించారు. సైఫ్  పై  ఫిర్యాదు  చేసినందుకు  హెచ్ఓడీ  ప్రీతినే తిట్టాడని వంశీ ఆరోపించారు. మరో వైపు  సైఫ్ పై  ఫిర్యాదు చేసిన  ప్రీతికి కౌన్సిలింగ్  ఇచ్చినట్టుగా  చెబుతున్న విషయమై  కూడా వంశీ స్పందించారు. కౌన్సిలింగ్  విషయమై తమ కుటుంబ సభ్యులు  కేఎంసీ  యాజమాన్యంతో సంప్రదింపులు  జరిపిన విషయాన్ని వంశీ  ప్రస్తావించారు. పోలీసులు  ఎవరినో  కాపాడేందుకు  ప్రయత్నిస్తున్నారని వంశీ ఆరోపించారు.  

click me!