
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో 30 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు నుంచి ప్రకటన వెలువడింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు మంజీర వాటర్ సప్లై ఫేజ్-2లో జంక్షన్ పనులను చేపట్టడం వల్ల తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. ఎర్రగడ్డ, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట్, జగద్గిరి గుట్ట, ఆర్‌సీ పురం, అశోక్ నగర్, మియాపూర్, లింగంపల్లి, చందా నగర్, దీప్తిశ్రీ నగర్, మదీనాగూడ, బీరంగూడ, అమీన్‌పూర్‌లలో నీటి సరఫరా నిలిచిపోనుంది. ఆగస్టు 19వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు 30 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనున్నట్టుగా అధికారులు తెలిపారు.
ఇక, మంజీరా వాటర్ సప్లై ఫేజ్ – 2లో కలబ్ గూర్ నుంచి పటాన్ చెరు వరకు, పటాన్ చెరు నుంచి హైదర్ నగర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా ఎంఎస్ పైపులైన్‌కు జంక్షన్ మరమ్మతు పనులు చేపట్టనున్నట్టుగా అధికారులు తెలిపారు. బీహెచ్‌ఈఎల్ క్రాస్‌రోడ్ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసేందుకు రోడ్లు, భవనాల శాఖ ఈ జంక్షన్‌పై కసరత్తు చేస్తోంది. దీంతో పైన పేర్కొన్న ప్రాంతాల్లో కొన్ని చోట్ల పూర్తిగా, మరికొన్ని చోట్ల పాక్షికంగా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల ప్రజలు అసౌకర్యం కలగకుండా నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు కోరింది.