తెలంగాణలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై దాడి పొరపాటున జరిగినట్లు .. దీని వెనక ఎలాంటి కుట్ర లేదని రైల్వే పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసారు.
వరంగల్ : భారత రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ రైళ్లపై వరుస దాడులు కలవర పెడుతున్నాయి. ప్రయాణ సమయాన్ని తగ్గిస్తూ పట్టాలపై వేగంగా పరుగుతీస్తున్న ఈ రైళ్లను టార్గెట్ గా చేసుకుని కొందరు రాళ్ళదాడికి పాల్పడుతున్నారు. ఇలా ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వందే భారత్ రైళ్లపై దాడులు వెలుగుచూసాయి. తాజాగా తెలంగాణలో వందేభారత్ రైలుపై దాడి జరగింది. అయితే ఈ దాడి వెనక ఆకతాయి చేష్టలు కాదు ఆకలి బాధ దాగివున్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే... జనగామ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన హరిబాబు(60) పిట్టలు కొట్టుకుని జీవిస్తుంటాడు. పంట పొలాల్లో, అటవీ ప్రాంతాల్లో వుండే వివిధ రకాల పక్షులను కొట్టిచంపి వాటిని ఇంటికి తీసుకెళ్ళేవాడు. వీటిని ఆ కుటుంబమంతా ఆహారంగా తీసుకునేది. ఇలా హరిబాబు ప్రతిరోజూ పక్షుల వేటకు జనగామ శివారు ప్రాంతాలకు వెళ్ళేవాడు... ఇలా గత శుక్రవారం కూడా వెళ్లాడు.
undefined
అయితే జనగామ శివారులోని రైల్వే పట్టాల సమీపంలో పక్షులను వేటాడుతుండగా అనుకోని సంఘటన చోటుచేసుకుంది. గులేరులో రాయిపెట్టి పిట్టను కొట్టేందుకు హరిబాబు ప్రయత్నించగా ఇదే సమయంలో విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళుతున్న వందేభారత్ రైలు అటువైపు వచ్చింది. దీంతో ఈ రాయికాస్త గురితప్పి ఆ రైలుకు తగిలి కిటికీ అద్దాలు పగిలిపోయాయి.
Also Read Hyderabad Metro:న్యూ ఇయర్ వేడుకలు.. హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం
వందే భారత్ రైళ్లపై దాడుల నేపథ్యంలో జనగామ శివారులో దాడి కూడా ఎవరో ఆకతాయిల పని అయివుంటుందని రైల్వే పోలీసులు అనుమానించారు. వెంటనే రంగంలోకి దిగిన ఆర్ఫిఎఫ్ పోలీసులు విచారణ చేపట్టగా హరిబాబు ఈ పని చేసినట్లుగా బయటపడింది. అయితే ఈ దాడి తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదని... పొరపాటున రాయి రైలుకు తగిలిందని అతడు చెబుతున్నాడు. కానీ రైల్వే పోలీసులు హరిబాబును అదుపులోకి తీసుకుని దాడికి ఉపయోగించిన గులేరును స్వాధీనం చేసుకున్నారు.