తెలంగాణ రాష్ట్ర నూతన అడ్వోకేట్ జనరల్ గా ప్రముఖ న్యాయ కోవిదులు సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రేవంత్ సర్కార్ అధికారిక ప్రకటన చేసింది.
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అధికారుల బదిలీలు జోరందుకున్నాయి. బిఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను తొలగించి వారిస్థానంలో కొత్తవారిని నిమమించుకుంటోంది కాంగ్రెస్ సర్కార్. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొత్త టీమ్ ను రెడీ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర అడ్వోకేట్ జనరల్ గా సీనియర్ న్యాయవాది సుదర్శన్ రెడ్డిని రేవంత్ సర్కార్ నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు కూడా జారీచేసింది.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి అడ్వోకేట్ జనరల్ గా (2011 నుండి 2014 వరకు) సుదర్శన్ రెడ్డి పనిచేసారు. 2009 నుండి 2010 అంటే దాదాపు సంవత్సరం ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసారు. ఇలా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన సుదర్శన్ రెడ్డికి తెలంగాణ ఏర్పాటుతర్వాత సరైన గుర్తింపు దక్కలేదు. ఇలా పదేళ్లపాటు సామాన్య న్యాయవాదిగా కొనసాగిన ఆయన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ అడ్వోకేట్ జనరల్ మారారు. ఇకపై తెలంగాణ ప్రభుత్వం సుదర్శన్ రెడ్డి సలహాలు సూచనలు తీసుకుంటూ న్యాయపరమైన వ్యవహారాల్లో ముందుకు వెళ్ళనుంది.
ఎవరీ సుదర్శన్ రెడ్డి?
జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచుపల్లికి చెందిన వ్యవసాయ కుటుంబంలో సుదర్శన్ రెడ్డి జన్మించారు. తల్లిదండ్రులు జగపతి రెడ్డి, బుచ్చమ్మ దంపతులు తమ బిడ్డను చిన్ననాటినుండే హైదరాబాద్ లో చదివించారు. నిజాం కాలేజీలో డిగ్రీ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో లా పూర్తిచేసారు. 1985 లో న్యాయశాస్త్రంలో పట్టా పొందిన సుదర్శన్ రెడ్డి న్యాయవాదిగా మారారు. బార్ కౌన్సిల్ లో తన పేరును నమోదు చేసుకుని ఇక వెనుదిరిగి చూడలేదు.
చాలా తక్కువకాలంలోనే మంచి లాయర్ గా గుర్తింపుపొందారు సుదర్శన్ రెడ్డి. అంచెలంచెలుగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో కీలక న్యాయవాదిగా మారారు. ముఖ్యంగా రాజ్యాంగ నిపుణిడిగానే కాదు సివిల్, క్రిమినల్ లాయర్ మంచి గుర్తింపు పొందారు. ఇలా ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు ఇప్పుడు తెలంగాణలోనూ అడ్వోకేట్ జనరల్ గా పనిచేసే అవకాశం సుదర్శన్ రెడ్డికి దక్కింది.