చేతులెత్తేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి: రేసులో ఉన్నది వీరే...

By narsimha lode  |  First Published Jan 3, 2020, 6:17 PM IST

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిలో కొనసాగేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తిగా లేరు.



పీసీసీ చీఫ్ పదవిలో కోనసాగేందుకు ప్రస్తుత చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరాసక్తత వ్యక్తం చేస్తుండడంతో ఆ పదవిని దక్కించుకునేందుకు నేతలు పోటీ పడుతున్నారు. ఈ పదవి ఎవరికి దక్కుతుందో అన్న ఆసక్తి పార్టీ నేతల్లో కనిపిస్తోంది. 

Also read:weekly roundup:తెలంగాణకు నెక్స్ట్ సీఎం ఆయనే, మున్సిపోల్స్‌పై దృష్టి

Latest Videos

undefined

రాష్ట్రంలో గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలను ఏకం చేసే అభ్యర్థిని  ఎంపిక చేయాలన్న అభిప్రాయంతో  ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ పలువురు నేతల పేర్లు పిసిసి చీఫ్ రేస్ లో  తెరపైకి వచ్చినా  ఢిల్లీ పెద్దలు నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో పెడుతున్నట్లు సమాచారం. 

పీసీసీ చీఫ్ పదవిని సీనియర్ నేతలతో పాటు జూనియర్లు కూడా  ఆశిస్తున్నారు. సామాజిక సమీకరణలను పలువురు నేతలు తెరపైకి తెస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి పిసిసి పదవిని మరోసారి ఇవ్వరాదని వి. హనుమంత రావు లాంటి నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. 

దాదాపు డజను మంది నేతలు పిసిసి రేస్ లో ఉన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత జానారెడ్డి,మాజీ మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

వివాదాలకు దూరంగా ఉండే శ్రీధర్ బాబు లేదా జానారెడ్డి లకు పీసీసీ పదవి ఇచ్చేందుకు హైకమాండ్ కూడా సిద్ధమైందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో పీసీసీ  నాయకత్వ మార్పు కచ్చితంగా జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పుడు పిసిసి చీఫ్ పదవి తీసుకుంటే రాబోయే ఎన్నికల వరకు కొనసాగించాలని కొంతమంది నేతలు హైకమాండ్ ముందు  డిమాండ్ ఉంచుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు పరిశీలించి ఢిల్లీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని సీనియర్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. 

అయితే పీసీసీ చీఫ్ పదవి ఎవరికి దక్కినా కత్తి మీద సాములాంటిదేనన్న అభిప్రాయం కూడా నేతల్లో ఉంది.  మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి వచ్చే ఓట్లు....సీట్ల అంశం కూడా పిసిసి చీఫ్ నియామకంపై ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి పీసీసీ చీఫ్ నియామకంలో ఢిల్లీ పెద్దలు ఎవరు వైపు ఆసక్తి చూపుతారో అన్న ఉత్కంఠ నెలకొంది.
 

click me!