
అమెరికా విద్యార్థి వీసా (F1 Visa) కోసం హాజరైన ఒక విద్యార్థికి యూఎస్ కాన్సులేట్‌లో టెక్నికల్ ప్రశ్నలు ఎదురవడం సంచలనం సృష్టించింది. ఈ సంఘటన మే 30, 2025న జరిగింది. ఇంటర్వ్యూకు సంబంధించిన వివరాలు ఓ విద్యార్థి Redditలో షేర్ చేయగా ఈ అంశం చర్చగా మారింది.
విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం, ఇంటర్వ్యూకు ఓ 30 ఏళ్ల వయసున్న అధికారి హాజరయ్యాడు. మొదట ఆయన విద్యార్హతలు, యూనివర్సిటీ ఎంపికలు వంటి సాధారణ విషయాలు అడిగాడు. కానీ కాసేపటికే టెక్నికల్ ప్రశ్నలు వేయడం ప్రారంభించాడు. డేటా స్ట్రక్చర్స్ (Data Structures), మెషిన్ లెర్నింగ్ (Machine Learning), ఆరేస్(Arrays) , లింక్డ్ లిస్ట్స్ (Linked Lists) మధ్య తేడాలు ఏంటి.? లీనియర్ రిగ్రెషన్ (Linear Regression) వంటి ప్రశ్నలను సంధించారు.
విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రశ్నలకు తాను సమాధానాలు ఇచ్చినా కూడా తన వీసా రిజక్ట్ చేశారని, మళ్లీ అప్లై చేసుకోవాలని తెలిపినట్లు విద్యార్థి తన ఆవేదన వ్యక్తం చేశాడు. తనలాంటి అనుభవం ఎవరికైనా ఎదురైందా.? మళ్లీ ఇంటర్వ్యూకి హాజరుకావడానికి మీ సూచనలు ఇవ్వండి అంటూ పోస్ట్ చేశాడు.
చదువు విషయంలో మీరు ఎంత సీరియస్‌గా రెడీగా ఉన్నారో పరీక్షించేందుకు ఇలాంటివి అడుగుతారని, డేటా సైన్స్ చదవాలంటే బలమైన టెక్నికల్ అవగాహన ఉందని చూపించాల్సి ఉంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్‌లో ఇటీవల స్టూడెంట్ వీసా తిరస్కరణలు తరచూ జరుగుతున్నా, ఇలా టెక్నికల్ ప్రశ్నలు వేయడం కొత్త ధోరణిగా కనిపిస్తోంది.