
తెలంగాణకు అనేక సౌకర్యాలు కల్పించేందుకు ప్రధానమంద్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్‌కు వచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ వేదికగా వర్చువల్‌గా తెలంగాణలో రూ.11,300 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. ఈ సభ వేదికగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ప్రజల తరఫున స్వాగతం తెలిపారు.
ప్రతి హిందువు తిరుమలలోని వెంకటేశ్వరస్వామి దర్శనం కోరుకుంటారని చెప్పారు. వారి కోసం ఈ వందేభారత్ రైలు ఎంతో సౌకర్యంగా ఉండనుందని చెప్పారు. ఈ రోజు ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దేశంలో 14వది అని చెప్పారు. అందులో తెలంగాణకే రెండు రైళ్లను మోదీ ఇవ్వడం జరిగిందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్ స్టేషన్‌ను అభివృద్ది చేస్తున్నట్టుగా చెప్పారు. ఎంఎంటీఎస్ సేవలను విస్తరించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకున్న కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్లే ఎంఎంటీఎస్ రెండో దశ ఆగిందని అన్నారు.
తెలంగాణలో రూ. 7,864 కోట్లతో జాతీయ రహదారులు చేపడుతున్నామని చెప్పారు. రూ. 1,366 కోట్లతో బీబీ నగర్ ఎయిమ్స్‌లో కొత్త భవనం నిర్మాణం చేపట్టనున్నట్టుగా తెలిపారు. రాష్ట్రంలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తున్నట్టుగా చెప్పారు. ప్రధాని మోదీకి అన్ని రాష్ట్రాలు సమానమేనని చెప్పారు. ఎలాంటి భేదాభావాలు లేకుండా మోదీ అభివృద్ది చేస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించి తెలుగు ప్రజలు ప్రధాని మోదీని ఆశీర్వదించాలని కోరారు.