
ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పాల్గొన్నారు. అంతకుముందు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి.. తదితరులు స్వాగతం పలికారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రధాని మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. తొలుత వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లోకి ప్రవేశించిన మోదీ.. అందులో ఒక బోగీలో ఉన్న విద్యార్థులతో ముచ్చటించారు.
ఇక, సికింద్రాబాద్- తిరుపతి నగరాల మధ్య రాకపోకలు సాగించనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. 3 నెలల వ్యవధిలో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.