
తెలంగాణ ప్రభుత్వంపై (telangana govt) మండిపడ్డారు బీజేపీ (bjp) నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy). వరి కొనుగోళ్లకు సంబంధించి జరుగుతున్న ఆందోళనలపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కరెంట్ మీటర్లు బిగించదని స్పష్టం చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎక్కడా ఒక జీవో కానీ ఒక చట్టం కానీ, ఒక ఆర్డినెన్స్ కానీ తీసుకురాలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి అధికారం కూడా కేంద్రానికి లేదని ఆయన పేర్కొన్నారు. దీనిని రైతులు అర్ధం చేసుకున్నారు కాబట్టే.. టీఆర్ఎస్ పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేసినప్పటికీ రైతులలో స్పందన లేదని గుర్తుచేశారు.
వడ్లపై లేని సమస్యను .. వున్నట్లుగా గత కొన్నిరోజులుగా ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి బాయిల్డ్ రైస్ (boiled rice) ఇచ్చేది లేదని రాసిచ్చిన సంగతి వాస్తవం కాదా అని సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల మెడ మీద కత్తిపెట్టి బెదిరిస్తున్నారని.. ఎప్పుడు తాము భయపెట్టలేదని కిషన్ రెడ్డి వెల్లడించారు. బాయిల్డ్ రైస్ దేశంలో ఎవరూ తినడం లేదని.. తెలంగాణలోనూ ఒక్క రైతు కూడా తినడం లేదని ఆయన చెప్పారు. కేరళ, పశ్చిమ బెంగాల్ , తమిళనాడులోనూ దీనిని వాడకం తగ్గిపోయిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇప్పటికే ప్రజల డబ్బుతో కొన్న బాయిల్డ్ రైస్ నిల్వలు కేంద్రం వద్ద పేరుకుపోతున్నాయని చెప్పారు. జాతీయ ఆహార భద్రత పథకం కింద దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు బియ్యాన్ని సరఫరా చేస్తుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణయే కాకుండా దేశంలో ఎక్కడైతే బాయిల్డ్ రైస్ ఉత్పత్తి జరుగుతుందో ఆ రాష్ట్రాలను చైతన్యవంతం చేశామని కేంద్రమంత్రి చెప్పారు. దీని ప్రకారమే కేసీఆర్ కూడా బాయిల్డ్ రైస్ ఇవ్వమని సంతకం చేశారని కిషన్ రెడ్డి వెల్లడించారు. లేని విషయాలను వక్రీకరించినట్లుగా కేసీఆర్ మాట్లాడారంటూ ఆయన దుయ్యబట్టారు.
అగ్రిమెంట్ ప్రకారం చివరి గింజ వరకు కేంద్రం కొనుగోలు చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం సరఫరా చేయాల్సిన మొత్తం బియ్యం 62 లక్షల మెట్రిక్ టన్నులని ఆయన తెలిపారు. ఇందులో (raw rice) రా రైస్ 17.78 లక్షల మెట్రిక్ టన్నులని.. బాయిల్డ్ రైస్ 44,75 లక్షల మెట్రిక్ టన్నులని.. ఇంకా కేంద్రానికి ఇవ్వాల్సిన బియ్యం 8.34 లక్షల మెట్రిక్ టన్నులని కిషన్ రెడ్డి చెప్పారు. ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసేందుకు ఆరు సార్లు డెడ్‌లైన్ పొడిగించినట్లు ఆయన వెల్లడించారు.
రైతులు పండించిన బియ్యం మీరు సేకరించలేదా... సేకరించిన ధాన్యాన్ని బ్లాకులో అమ్ముకున్నారా అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రైస్ మిల్లర్లకు లబ్ధి చేకూర్చేందుకు ఇలా చేస్తున్నారా అంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. రా రైస్ కేంద్రానికి ఇచ్చి.. నూకల్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని ఆయన కోరారు. ఇప్పుడైనా రా రైస్ ఎంత ఇచ్చినా కేంద్రం కొంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం రైస్‌ను 33 రూపాయలకు కొనుగోలు చేసి.. రూ.3కి ఇచ్చేందుకు ఎంతో నష్టాన్ని భరిస్తుందని ఆయన తెలిపారు.