రేపు పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ .. ఆహ్వానం పంపాం, కేసీఆర్ వస్తారనే అనుకుంటున్నాం : కిషన్ రెడ్డి

By Siva KodatiFirst Published Jan 14, 2023, 5:35 PM IST
Highlights

రేపటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వస్తారని భావిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానాలు పంపామని ఆయన చెప్పారు. 
 

సికింద్రాబాద్- విశాఖపట్నం నగరాల మధ్య కేంద్రం ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును రేపు ఉదయం 9 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపటి కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానాలు పంపామని.. సీఎం కేసీఆర్ కూడా ప్రారంభోత్సవానికి వస్తారనే భావిస్తున్నామని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లలో రేపు ప్రారంభించబోయేది 6వ రైలని.. దేశవ్యాప్తంగా మొత్తం 100 రైళ్లను నడపాలని భావిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. 

ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎనిమిదేళ్లుగా హెల్త్ అండ్ మెడికల్ విభాగాల్లో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో అత్యాధునిక వైద్యం అందించాలన్నదే తమ ధ్యేయమన్నారు. కరోనా వ్యాక్సిన్, చిన్నారుల వ్యాక్సిన్, బాలింతల వ్యాక్సిన్‌తో పాటు యోగాను దేశంలోని అన్ని ప్రాంతాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పల్లెలు, పట్నాల్లో పరిశుభ్రమైన వాతావరణం కోసం స్వచ్ఛ్‌ భారత్ కార్యక్రమం అమలు చేస్తున్నామని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 65 వేల కోట్లను ఖర్చు చేస్తోందన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద 1.50 లక్షల వెల్‌నెస్ సెంటర్లను దేశమంతా ఏర్పాటు చేశామని వీటిని తెలంగాణల్లో బస్తీ దవాఖానాలుగా పిలుస్తున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆయుష్ డిపార్ట్‌మెంట్ ద్వారా తెలంగాణలో 418 వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేశామని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

ALso REad: సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టికెట్ బుకింగ్ ప్రారంభం.. చార్జీలు, సిట్టింగ్ వివరాలు ఇవే..

అంతకుముందు కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో 3 లక్షల 68 వేల కోట్లు పంపామన్నారు. కానీ కేంద్రం తెలంగాణకు ఇచ్చింది లక్షా 68 వేల కోట్లేనని కేటీఆర్ దుయ్యబట్టారు. తాను చెప్పింది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. కిషన్ రెడ్డి చెప్పింది తప్పయితే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతారా అని కేటీఆర్ సవాల్ విసిరారు. నీకు పదవికి రాజీనామా చేసే దమ్ము ఎలాగూ లేదు.. తెలంగాణ ఉద్యమంలో కూడా రాజీనామా చేయలేని అసమర్ధుడివంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం తెలంగాణ ప్రజలకైనా క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కనీస పరిజ్ఞానం లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటి వరకు దేశానికి సేవలందించిన 14 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే మోడీ చేసిన అప్పు ఎక్కువ అని కేటీఆర్ ఆరోపించారు. 

రెండు జాతీయ పార్టీలు అబద్ధాలతో, తప్పుడు ప్రచారాలతో ప్రజల వద్దకు వస్తున్నాయని మంత్రి విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం పెరిగిందన్నారు. పెట్టుబడి ద్వారా సంపద సృష్టించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని కేటీఆర్ తెలిపారు. మోడీ పాలనలో దేశాన్ని దోచుకున్న వాళ్లు మాత్రమే బాగుపడ్డారని మంత్రి దుయ్యబట్టారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారినా.. జెండా, ఎజెండా, మనుషులు, డీఎన్ఏ మారలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 
 

click me!