తన స్థాయి పెరుగుతుందనే ప్రధానిపై కేసీఆర్ విమర్శలు.. ధీటుగా బదులిస్తాం: కిషన్ రెడ్డి హెచ్చరిక

By Siva KodatiFirst Published Nov 20, 2022, 5:40 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధానిని విమర్శిస్తే స్థాయి పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారని.. బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ధీటుగా బదులివ్వాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు

బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ధీటుగా బదులివ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శామీర్‌పేటలో జరుగుతున్న బీజేపీ శిక్షణా తరగతులకు ఆయన హాజరై ప్రసంగించారు. ప్రగతి భవన్‌లో కూర్చొని దేశ ఆర్ధిక వ్యవస్ధను విమర్శిస్తున్నారని.. ప్రధానిని విమర్శిస్తే స్థాయి పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈడీ, సీబీఐ, ఐటీలు ... ఊరికే కూర్చుంటాయా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా నిషేధించారని దుయ్యబట్టారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

ALso REad:అహింసా, ప్రజాస్వామ్య బద్దంగానే కేసీఆర్‌ను ఎదుర్కొంటాం: బీజేపీ నేత తరుణ్ చుగ్

ఇదే కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ... బీజేపీ ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ముందుకు పోతోందన్నారు . పార్టీని బలోపేతం చేసేందుకు అనేకమంది కార్యకర్తలు త్యాగాలు చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలతో మరింతగా మమేకమవుతామని... సభలు, సమావేశాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు పార్లమెంట్‌లో రెండు సీట్లతో వున్న బీజేపీ.. నేడు 303 స్థానాలను గెలిచే స్థాయికి చేరిందన్నారు. అధికారంలోకి రావాలనుకున్నాం కానీ.. అడ్డదారుల్లో దానిని సాధించాలని అనుకోలేదని బండి సంజయ్ గుర్తుచేశారు. ఈ మూడు రోజులూ 14 అంశాలపై నేతలకు శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. 
 

click me!