మునుగోడులో టీఆర్ఎస్ ను ఓడించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని కేంద్ర మంత్రికిషన్ రెడ్డి కోరారు. కేసీఆర్ అహంకారపూరిత వైఖరికి ప్రజలు బుద్ది చెప్పాలని ఆయన కోరారు.
మునుగోడు : మునుగోడు ఉప ఎన్నికను తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవవానికి కల్వకుంట్ల కుటుంబం అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.మునుగోడు అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డి సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా చండూరులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మునుగోడు ప్రజలు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారెవరూ ప్రస్తుతం టీఆర్ఎస్ లో లేరన్నారు. తెలంగాణ ఉద్యమం పేరుతో టీఆర్ఎస్ ఏర్పడిందన్నారు. 1200 మంది అమరుల త్యాగాల మీద టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైందని ఆయన గుర్తు చేశారు. కుటుంబ పాలనను ప్రజలపై రుద్దుతున్న కల్వకుంట్ల కుటుంబానికి బుద్ది చెప్పాలని కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మంట గలిపేలా తన పార్టీపేరులో తెలంగాణ ను కూడ తొలగించారని కేసీఆర్ పై కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ సర్కార్ పనిచేయడం లేదన్నారు. తెలంగాణలో సమస్యలు అన్నీ పరిష్కరించినట్టుగా టీఆర్ఎస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు.కేసీఆర్ అహంకారానికి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు మునుగోడులో టీఆర్ఎస్ కు బుద్ది చెబుతారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అవినీతి కుంభకోణాలకు ప్రజలే మీటర్లు పెట్టారన్నారు.
undefined
డబ్బులను పంచి టీఆర్ఎస్ ఓట్లను కొనుగోలు చేయాలని చూస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఓట్లను అమ్ముకొనే స్థితిలో మునుగోడు ప్రజలు లేరనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని బండి సంజయ్ హితవు పలికారు. దుబ్బాక, హుజూరాబాద్ లలో వచ్చిన ఫలితాలే మునుగోడులో వస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబం చరిత్ర తెలుసుకోవాలన్నారు.
also read:మునుగోడు బైపోల్ 2022 : టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థల నామినేషన్లు నేడు...
కోమటిరెడ్డి కుటుంబం మొదటి నుండి కాంట్రాక్టులు చేస్తుందన్నారు. ఒకప్పుడు కేసీఆర్ కు చెందిన రథం, కారును బ్యాంకు వాళ్లు లాక్కెళ్లలేదా అని ప్రశ్నించారు.ఇప్పుడు రూ. 100 కోట్ల విమానం ఎలా కొనుగోలు చేశారో చెప్పలని కేసీఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని అనేక అవినీతి కుంభకోణాల్లో కేసీఆర్ కుటుంబానికి పాత్ర ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ఈ విషయమై చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. హుజూరాబాద్ , నాగార్జునసాగర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. టీఆర్ఎస్ కు డిపాజిట్ గల్లంతు కానుందన్నారు.