26 లిఫ్ట్‌లు, 32 ఎస్కలేటర్లు ... విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ : కిషన్ రెడ్డి

Siva Kodati |  
Published : Nov 14, 2022, 07:25 PM IST
26 లిఫ్ట్‌లు, 32 ఎస్కలేటర్లు ... విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ : కిషన్ రెడ్డి

సారాంశం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 36 నెలల్లో స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. స్టేషన్‌లో 26 లిఫ్ట్‌లు, 32 ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సోమవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం ఏకే జైన్‌తో పాటు ఆయన సమీక్షలో పాల్గొన్నారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ... రూ.719.30 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచామని, విమానాశ్రయం తరహాలో ఆధునీకీకరిస్తామన్నారు. స్టేషన్‌లో 26 లిఫ్ట్‌లు, 32 ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. 36 నెలల్లో స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

విజయవాడ- సికింద్రాబాద్ మార్గంలో వందే భారత్ రైళ్లు రాబోతున్నాయని, వాటిని తిరుపతి వరకు పొడిగించాలని రైల్వే శాఖను కోరామని మంత్రి చెప్పారు. ఖాజీపేటలో రూ.384 కోట్లతో వ్యాగన్ వర్క్ ‌షాప్ కోసం టెండర్లు పిలిచినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు రాష్ట్ర వాటా నిధులు విడుదల చేస్తే పనులు వేగవంతమవుతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 

అంతకుముందు రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభం సందర్భంగా శనివారం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎరువుల ఫ్యాక్టరీతో తెలంగాణలో యూరియా కొరత తీరుతుందన్నారు. కేంద్రం ప్రతి యూరియా బస్తాపై భారీగా రాయితీ ఇస్తుందని చెప్పారు. రూ. 6,338 కోట్లతో ఆర్ఎఫ్‌సీఎల్‌ను పునరుద్దరించడం జరిగిందని తెలిపారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు కోసం కేంద్రం ఏటా రూ. 26 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. 2014లో తెలంగాణలో 24 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనేవాళ్లని చెప్పారు. ఇప్పుడు 142 లక్షల టన్నుల ధాన్యం కొంటున్నామని తెలిపారు. కానీ కొందరు కేంద్రం ధాన్యం కొనడం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ALso Read:ఆర్‌ఎఫ్‌సీఎల్‌తో తెలంగాణలో యూరియా కొరత తీరుతుంది.. సింగరేణి ప్రైవేటుపరం అంటూ తప్పుడు ప్రచారం: కిషన్ రెడ్డి

2014కు ముందు ధాన్యం క్వింటాల్‌కు ఎంఎస్‌పీ 1,360 ఉంటే.. మోదీ ప్రభుత్వం వచ్చాక అది 2,040కి చేరిందని అన్నారు. 2014 నాటికి తెలంగాణలో 2,511 కి.మీ మేర ఉన్న జాతీయ రహదారులు ఉండేవనీ.. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 5 వేల కి.మీకు చేరాయని చెప్పారు. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తారని ఎవరూ చెప్పారని ప్రశ్నించారు. సింగరేణి మెజారిటీ షేర్‌లు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉన్నాయని చెప్పారు. కానీ కేంద్రం సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. 

కోల్ ఇండియాకు సంబంధించిన ఏ పరిశ్రమను ప్రైవేటుపరం చేయలేదని తెలిపారు. సింగరేణి పరిధిలోని ఇతర రాష్ట్రాల్లోని బొగ్గు గనులను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారని అన్నారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఆలోచన కేంద్రానికి లేదని అన్నారు. రామగుండంలో 1600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్క తెలంగాణలోనే కేంద్రం 4 వేల కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. రామగుండంలో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారని కిషన్ రెడ్డి చెప్పారు. రామగుండంలో ఈఎస్‌ఐ ఆస్పత్రిని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని.. ఇక్కడున్న ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం
Hyderabad Vegetable Price : ఈ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు ఎలా ఉంటాయంటే..