కేంద్ర ప్ర‌భుత్వానిది ద్వంద వైఖ‌రి..రైతులు జాగ్ర‌త్త‌గా ఉండాలి- మంత్రి నిరంజ‌న్ రెడ్డి

By team teluguFirst Published Dec 10, 2021, 1:06 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు విషయంలో రెండు విధాలుగా మాట్లాడుతోందని మంత్రి నిరంజన్ రెడ్డి  ఆరోపించారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కోరుతూ రైతులకు  ఆయన బహిరంగ లేఖ రాశారు.

ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ద్వంద వైఖ‌రిని అవ‌లంభిస్తోంద‌ని తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. రైతులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. బీజేపీ నాయ‌కుల మాట‌లు విని న‌ష్ట‌పోవ‌ద్ద‌ని సూచించారు. వ‌రి ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంట వంటి విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ మంత్రి నిరంజ‌న్ రెడ్డి రైతుల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. 

కేంద్రం రైతు వ్య‌తిరేక విధానాలు అవ‌లంభిస్తోంది..
కేంద్ర ప్ర‌భుత్వం రైతు వ్య‌తిరేక విధానాలు అనుస‌రిస్తోందని మంత్రి ఆ లేఖ‌లో ఆరోపించారు. తెలంగాణ‌లో వ‌డ్ల సేక‌ర‌ణ విషయంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయ‌ల్, న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ భిన్నంగా స్పందించార‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని తెలంగాణ రైతాంగం గుర్తించి స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరారు. యాసంగిలో వ‌రి పండించ‌కుండా ప్ర‌త్యామ్నాయ పంట‌లవైపు రైతులు దృష్టి సారించాల‌ని కోరారు. వ‌రి కాకుండా త‌క్కువ పెట్టుబ‌డితో అధిక లాభాలు సంపాదించే పంట‌ల వైపు రైతులు అడుగు వేయాల‌ని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల మార్కెటింగ్ కు తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయ‌ని చెప్పారు. 

తెలంగాణలో కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..

ధాన్యం తీసుకెళ్ల‌కుండా తెలంగాణ మీద నెపం...
గ‌తేడాది సేక‌రించిన ధాన్యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం తీసుకెళ్ల‌కుండా త‌ప్పు తెలంగాణ ప్ర‌భుత్వానిదే అన్న‌ట్టు మాట్లాడుతోందని చెప్పారు. గ‌తేడాది రైతుల నుంచి సేక‌రించిన ధాన్యాన్ని మ‌రఆడించి బియ్యంగా మార్చామ‌ని తెలిపారు. వాటిని గోదాంల‌లో నిల్వ ఉంచామ‌ని తెలిపారు. వాటిని తీసుకెళ్ల‌డానికి కేంద్రం చ‌ర్య‌లు తీసుకోకుండానే ఆ త‌ప్పును తెలంగాణ మీద నెడుతోంద‌ని ఆరోపించారు. స‌రైన స‌మ‌యంలో వాటిని తీసుకెళ్ల‌కుండా ఎఫ్‌సీఐ ఇబ్బంది పెడుతోంద‌ని చెప్పారు. 
ఎఫ్‌సీఐ గ‌తంలో ఉప్పుడు బియ్యాన్ని ప్రోత్స‌హించి, ఇప్పుడు ఒక్క సారిగా ఉప్పుడు బియ్యం వ‌ద్దంటోంద‌ని అన్నారు. నిల్వ‌లు పేరుకుపోయాయ‌నే కార‌ణం చెప్తూ దొడ్డు బియ్యాన్ని పండించొద్ద‌ని తెల‌ప‌డం సరైంది కాద‌ని అన్నారు. ఒక వైపు దొడ్డు బియ్యాన్ని పండించొద్ద‌ని కేంద్రం ప్ర‌భుత్వం చెబుతోంద‌ని, కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన రాష్ట్ర నాయ‌కులు మాత్రం వ‌రి పండించాల‌ని చెప్తున్నార‌ని తెలిపారు. ఇది ఎంత వ‌ర‌కు స‌రైందని అన్నారు. ఇలా ఒకే పార్టీ నాయ‌కులు రెండు ర‌కాలుగా మాట్లాడ‌టం ఏంట‌ని ప్ర‌శ్నించారు. రైతులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని కోరారు. యాసంగిలో వ‌రి పండించ‌కుండా ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌ను పండించాల‌ని కోరారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంట‌లు పండించి రైతులు ఆదాయం పొందాల‌ని సూచించారు. 

click me!