MLC Polls: ఇప్పటివరకు 30 శాతాని పైగా పోలింగ్ నమోదు.. ప్రలోభాలు జరిగినట్టు రుజువు కాలేదు: శశాంక్ గోయల్

By Sumanth KanukulaFirst Published Dec 10, 2021, 11:24 AM IST
Highlights

తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకే (Telangana MLC Elections 2021)  నేడు పోలింగ్ కొనసాగుతుంది. అన్ని స్థానాల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ (Telangana CEO Shashank Goyal) తెలిపారు.

తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకే (Telangana MLC Elections 2021)  నేడు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అన్ని స్థానాల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ (Telangana CEO Shashank Goyal) తెలిపారు. ఇప్పటివరకు 30 శాతానికి పైగా పోలింగ్ నమోదైందని చెప్పారు. క్యాంప్‌లపై జిల్లా యంత్రాంగం విచారణ జరిపినట్టుగా వెల్లడించారు. ప్రలోభాలు జరిగినట్టుగా రుజువు కాలేదని అన్నారు. క్యాంప్ రాజకీయాలపై ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. ఫిర్యాదులు వస్తే విచారిస్తామని చెప్పారు. 

ఇక, మొత్తం ఐదు ఉమ్మడి జిల్లాల్లోని ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు, ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానం ఉన్నాయి. మొత్తం 26 మంది అభ్యర్థులు ఈ ఆరు స్థానాల్లో పోటీ పడుతున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు.  ఐదు ఉమ్మడి జిల్లాల్లోని 37 పోలింగ్‌ కేంద్రాల్లో 5,326 మంది ఓటర్లు ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

అయితే ఉదయం 10 గంటల వరకు పలు చోట్ల బాగానే పోలింగ్ నమోదు కాగా, మరికొన్ని చోట్ల మాత్రం చాలా మందకొడిగా సాగుతుంది. క్యాంపుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. వారు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటే పోలింగ్ ప్రక్రియ వేగంగా మారే అవకాశం ఉంది. 

ఎక్క‌డి నుంచి ఎందరు పోటీ అంటే.. ? 
అని చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు బరిలో ఉండగా.. ఖమ్మం, మెదక్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇంకా మిగిలిన వారు స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నారు. వీరిలో కొందరు టీఆర్‌ఎస్ రెబల్స్ ఉన్నారు.  ఆదిలాబాద్ జిల్లాలో ఒక స్థానం ఖాళీగా ఉంటే  అక్క‌డ ఇద్ద‌రు పోటీలో ఉన్నారు. అలాగే క‌రీంగ‌న‌ర్‌లో ఉన్న రెండు స్థానాల‌కు ప‌ది మంది పోటీలో ఉన్నారు. ఖ‌మ్మంలో రెండు స్థానాల‌కు నలుగురు, న‌ల్గొండ‌లో ఒక స్థానానికి ఏడుగురు పోటీ చేస్తున్నారు. అలాగే మెద‌క్‌లో ఒక స్థానానికి ముగ్గరు పోటీలో నిలిచారు. మ‌రి ఇందులో అధికారిక పార్టీకి చెందిన వారు కాకుండా ఇత‌రులు ఎవ‌రైనా గెలుస్తారా ? లేదా టీఆర్ఎస్ పార్టీయే క్లీన్ స్వీప్ చేసుకుపోతుందా అనే విష‌యం తెలియాలంటే ఈ నెల 14వ తేదీ వ‌ర‌కు ఎదురుచూడాల్సి ఉంటుంది. 

click me!