నిరుద్యోగ భృతి (unemployment allowance) చెల్లిస్తామని కాంగ్రెస్ (Congress) పార్టీ ఎక్కడా హామీ ఇవ్వలేదని తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) చేసిన ప్రకటనపై నిరుద్యోగులు మండిపడ్డారు. ఓయూలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో (Congress manifesto)ను తగలబెట్టారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోను దహనం చేసి ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఏనాడూ హామీ ఇవ్వలేదని డిప్యూటీ సీఎం ప్రకటించారు. అయితే దీనిని నిరసిస్తూ నిరుద్యోగ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో గురువారం ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ టీమ్ లో అజిత్ రెడ్డి ... ఇంతకీ ఎవరితను?
వర్సిటీ ఆవరణలో కాంగ్రెస్ మేనిఫెస్టోను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతా రాయ్.. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 9వ పేజీని చదివి వినిపించారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు రూ.4 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని తెలిపారు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన సభలో ప్రియాంక గాంధీ కూడా నిరుద్యోగ యువతకు రూ.4 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
నిరుద్యోగ యువతకు భృతి ఇస్తామని చెప్పి 1.8 శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మానవతా రాయ్ చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 రోజులు కూడా గడవక ముందే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని వెనక్కి తీసుకుందని విమర్శించారు. ఈ హామీని వెనక్కి తీసుకొని అధికార పార్టీ నిరుద్యోగులను మోసం చేస్తోందని చెప్పారు.
అయోధ్య రాములోరి పూజారిగా తిరుపతి వేద విద్యాలయం విద్యార్థి...
వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న రెండు లక్షల ఉద్యోగాలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. వాటి భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇదిలా ఉండగా.. నిరుద్యోగ భృతి ఇరువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఆ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ చేసిన ప్రకటన ఓ వైపు, ఆ విషయంపై తమ పార్టీ ఎక్కడ హామీ ఇవ్వలేదని భట్టి విక్రమార్క చేసిన ప్రకటన మరో వైపు ఉంచిన వీడియోలను నిరుద్యోగులు షేర్ చేస్తున్నారు.