
Telangana: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్.. తెలంగాణ టీఆర్ఎస్ సర్కారుపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు (కేసీఆర్) ను టార్గెట్ చేస్తూ.. తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రైతాంగాన్ని ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్రాన్ని పాలించలేక దేశమంతా తిరుగుతున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. తనను ఏ ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకోకపోవడంతో కేసీఆర్ పనికిమాలిన ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అపాయింట్‌మెంట్ కోసం న్యూఢిల్లీలో కేసీఆర్ ఎదురుచూడాల్సి రావడం సిగ్గుచేటని అన్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పలేరంటూ విమర్శించారు.
ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్ర రైతు కుటుంబాలను ఆదుకోవడానికి బదులు ఇతర రాష్ట్రాల రైతులకు కేసీఆర్ చెక్కులు పంపిణీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. 2018లో జాతీయ స్థాయిలో సత్తా చాటడంలో కేసీఆర్ విఫలమయ్యారని.. రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మరిన్ని రుణాలు తీసుకురావాలన్న సీఎం నిర్ణయాన్ని కాగ్ నివేదిక తప్పుబట్టిందని ఆరోపించారు. రాష్ట్రలో అభివృద్ది కుంటుపడుతున్నదని ఆరోపించారు. రూ.3 లక్షల 29 వేల కోట్లకు లెక్కలు చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. ఉద్యోగులకు జీతాలు, సర్పంచ్‌లకు బిల్లులు ఇవ్వలేని అప్పుల కుప్పగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని మండిపడ్డారు.
ఇదిలావుండగా, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఈటల రాజేందర్ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ.. తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అమరవీరుల త్యాగఫలం తెలంగాణ రాష్ట్రం.. వారి ఆశయ సాధనకోసం పునరంకితమవుదాం.. జోహార్ తెలంగాణ అమరవీరులకు.. జై తెలంగాణ ! ✊ అని ట్విట్టర్ వేదికగా స్పందించారు.
అంతకుముందు తెలంగాణ బీజేపీ చీఫ్ సైతం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. పంచాయతీల అభివృద్ధి కోసం 2014 ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం (trs govt) ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏర్పడిన ఈ 8 ఏళ్ల పాలనలో జరిగినదేమిటో అర్థం చేసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. సర్పంచులు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేస్తుంటే.. రూ.2 లక్షల నుంచి రూ.25 లక్షల వరకున్న ఆ బిల్లులను ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని సంజయ్ దుయ్యబట్టారు. నిధులు మంజూరు చేస్తున్నట్టు జీవోలు ఇస్తున్నా.. అకౌంట్లను మాత్రం ఫ్రీజ్ చేస్తోందని ఆయన విమర్శించారు. సర్పంచులెవరైనా ప్రశ్నిస్తే.. సస్పెండ్ చేస్తామని, చెక్ పవర్ ను రద్దు చేస్తామని బెదిరిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. హక్కుల కోసం గాంధేయ మార్గంలో పోరాటం చేయాలని, బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన సర్పంచ్‌లకు హామీ ఇచ్చారు.