Hyderabad : రంజాన్ పండక్కిముందు విషాదం... కరెంట్ షాక్ తో సోదరులు సహా ముగ్గురి మృతి

By Arun Kumar P  |  First Published Apr 13, 2023, 12:08 PM IST

విద్యుత్ షాక్ తో ముగ్గురు యువకులు మృతిచెందిన విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 


హైదరాబాద్ : పవిత్ర రంజాన్ నెలలో ఉపవాస దీక్ష ఆచరిస్తున్న యువకులు ప్రమాదవశాత్తు మృతిచెందారు. ఇంట్లోనే విద్యుత్ షాక్ కు గురయి ఇద్దరు సోదరులతో పాటు మరో యువకుడు దుర్మరణం చెందిన విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. షేక్ పేట పారామౌంట్ కాలనీలో అనస్(19), రిజ్వాన్(17) సోదరులు తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నారు. గురువారం వీరి కోసం స్నేహితుడు రజాక్(16) ఇంటికి వెళ్లాడు. ముగ్గురు కలిసి సరదాగా మాట్లాడుకుంటుండగా ట్యాంక్ లో నీరు అయిపోవడంతో బోర్ మోటార్ ఆన్ చేయడానికి అనస్ వెళ్లాడు. స్విచ్ ఆన్ చేసే క్రమంలో అనస్ కరెంట్ షాక్ కు గురయ్యాడు.  

Latest Videos

అనస్ అరుపులు విన్న రిజ్వాన్ వెళ్లేసరికి కరెంట్ షాక్ విలవిల్లాడిపోతున్న సోదరున్ని చూసాడు. దీంతో వెనకాముందు చూసుకోకుండా అన్నను కాపాడే ప్రయత్నం చేయడంతో రిజ్వాన్ కూడా కరెంట్ షాక్ కు గురయ్యాడు. వీరిద్దరినీ రక్షించేందుకు ప్రయత్నించిన రజాక్ కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇలా ముగ్గురు యువకులు కరెంట్ షాక్ తో అక్కడికక్కడే  దుర్మరణం పాలయ్యారు. 

Read More Hyderabad: మహిళ హత్య.. ప్లాస్టిక్ బ్యాగ్‌లో కుళ్లిపోయినన స్థితిలో మృతదేహం లభ్యం

కుటుంబసభ్యులు, చుట్టుపక్కల ఇళ్లవారు చేరుకునే సరికే ముగ్గురు యువకులు మృతిచెందారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి యువకుల మృతదేహాలను హాస్పిటల్ కు తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. 

ఇద్దరు కొడుకులు ఇలా విద్యుత్ షాక్  తో మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రజాక్ కుటుంబసభ్యులు కూడా కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఈ ఘటన స్థానికులను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 
 

click me!