
TPCC president A. Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి అధికార పార్టీ బీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుటుంబ స్వార్థానికి హైదరాబాద్ బలైపోయిందని ఆరోపించారు. గాంధీభవన్ లో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం తన స్వార్థం కోసం హైదరాబాద్ నగరాన్ని బలిచేస్తున్నారని అన్నారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరం సర్వనాశనమైందనీ, నిజాం కూడా హైదరాబాద్ నగరంలో ఇంత విధ్వంసం సృష్టించలేదన్నారు.
"బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలతో పాటు కేబీఆర్ పార్కు సమీపంలో నిర్మాణాలకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఇవి ఎత్తైన ప్రదేశాలు కాబట్టి విమానాల రాకపోకలకు ఆటంకం కలగకుండా నిర్మాణానికి ఎయిర్ పోర్టు అథారిటీ అనుమతి తీసుకోవాలి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లలో ప్రత్యేక సహజ వాతావరణం ఉండడంతో అక్కడ భవన నిర్మాణాలకు ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నారు. కేబీఆర్ పార్కును ఎకో సెన్సిటివ్ జోన్ గా పరిగణిస్తారు. అందుకే కేబీఆర్ పార్కు పరిసరాల్లో వాణిజ్య భవనాలు చాలా తక్కువగా ఉన్నాయి. కేసీఆర్ వచ్చాకే పార్కు చుట్టూ నిర్మాణాలు పెరుగుతున్నాయనీ, అక్కడి వాతావరణాన్ని నాశనం చేస్తున్నారని" రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేబీఆర్ పార్క్ ప్రాంతంలో 5 అంతస్తులకు అనుమతి లేని చోట 21 అంతస్తుల భవనానికి అనుమతి ఇచ్చారని విమర్శించారు.
కేబీఆర్ పార్క్ నుంచి కేన్సర్ ఆస్పత్రికి వెళ్లే దారిలో బీసీ స్టడీ సర్కిల్ సమీపంలో నిజాం నవాబులకు చెందిన హెరిటేజ్ భవనం ఉంది. ఈ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేశారని ఆరోపించారు. శాసనసభలో మున్సిపల్ చట్టంపై చర్చ సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు కేసీఆర్ అణచివేసేందుకు ప్రయత్నించారన్నారు. గత నిబంధనల ప్రకారం ఇందులో 1200 గజాల స్థలం గ్రీన్ బెల్ట్. మిగిలిన 5800 గజాలకు 60 వేల చదరపు అడుగులకు మాత్రమే అనుమతి ఇవ్వాలన్నారు.
3 వేల గజాల లోపు అనుమతులు ఇస్తే పార్కు పర్యావరణ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 21 అంతస్తుల అపార్ట్ మెంట్ కేబీఆర్ పార్క్ సమీపంలో భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తనున్నాయి. కేబీఆర్ పార్కులో నివసించే ప్రజలు ఉపయోగించే ఏసీల నుంచి వెలువడే వాయువుల వల్ల కేబీఆర్ పార్కులో జాతీయ పక్షి నెమళ్లు, ఇతర పక్షుల మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, అక్కడి పర్యావరణం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ నేతలు విధ్వంసం సృష్టించారన్నారు. "మంత్రి కేటీఆర్, ఆయన తండ్రి కలిసి ఇంత విధ్వంసం చేస్తారా? ప్రజలు మిమ్మల్ని నమ్మి రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే ఇంత విధ్వంసం చేస్తారా? కమీషన్ల ఆశతో నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్లు జారీ చేస్తుండటంతో నగరంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొద్దిపాటి వర్షంతోనే వరదలు ఎందుకు వస్తాయి? కేసీఆర్, కేటీఆర్, సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, జయేశ్ రంజన్, వెంకట్రామిరెడ్డితో కూడిన డీ9 (దావూద్ 9) గ్యాంగ్ హైదరాబాద్ నగరంలో విధ్వంసం సృష్టిస్తోంది. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇది కేసీఆర్ దుర్మార్గపు పాలనకు పరాకాష్ట" అన్నారు.