కరీంనగర్ లో ఓ కవల అక్కాచెల్లెళ్లు పదో తరగతి పరీక్షల్లో 10జీపీఏ సాధించారు. చదువుల సరస్వతులుగా అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
కరీంనగర్ : ఆడపిల్లలు పుట్టారని భార్యల్ని వదిలేసే భర్తలకు చెంపపెట్టు లాంటి ఘటన ఇది. తండ్రి వదిలేసిన ఇద్దరు ఆడపిల్లలు పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. 10 జిపిఏ సాధించారు. కవల ఆడపిల్లలు పుట్టారని వారు పుట్టగానే తండ్రి.. తల్లిని వదిలేశాడు. దీంతో అమ్మ, అమ్మమ్మ, తాతయ్యలే ఆ ఇద్దరు కవలలని పెంచి పెద్ద చేశారు. చక్కగా విద్యాబోధన చేయించారు. వారి శ్రమకు తగ్గట్టుగానే ఆ కవలలు ఇద్దరు చక్కగా చదువుకున్నారు. టెన్త్ లో 10 జీపీఏ సాధించి అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు.
దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవ పట్నానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి అల్లెంకి వీరేశం మనవరాళ్లే వీరిద్దరు. ఆయనకు ఒక కూతురు, ఒక కొడుకు. ప్రస్తుతం ఆయన కూతురు కవిత పెద్దపల్లి కలెక్టరేట్లో అవుట్సోర్సింగ్ లో ఎలక్ట్రానిక్స్ జిల్లా మేనేజర్ గా పనిచేస్తున్నారు. పదహారేళ్ల క్రితం ఆమెకు వివాహమయ్యింది. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చింది. ఏడో నెల పడ్డ తర్వాత డెలివరీ కోసం పుట్టింటికి పంపాడు భర్త.
undefined
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. రేణుకకు బెయిల్.. కానీ ఈ షరతులు పాటించాల్సిందే..!!
ఆ తర్వాత కాన్పులో ఆమె ఇద్దరు కవల కూతుళ్లకు జన్మనిచ్చింది. దీంతో ఆడపిల్లలు పుట్టారు అన్న కారణంతో ఆమెను పుట్టింట్లోనే వదిలేశాడు. ఏమి చేయలేక వారి అలనా పాలన అమ్మమ్మ వనజ, తాతయ్య వీరేశం చూస్తున్నారు. కవల పిల్లల పేర్లు శర్వాణి, ప్రజ్ఞాని. వీరిద్దరూ ఐదవ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఆరో తరగతి నుంచి మోడల్ స్కూల్ లో చదివారు.
బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఇద్దరికీ 10 జీపీఏ రావడంతో అందరిలోనూ సంతోషం వెల్లి విరిసింది. ‘తాతయ్య, అమ్మమ్మ, మా ప్రిన్సిపల్ జ్యోతి టీచర్ ల ప్రోత్సాహంతోనే ఇది సాధించాం’ అని ఆ ఇద్దరు సోదరీమణులు చెబుతున్నారు.